మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా విజేత విడుదల ఇంకా కాస్త దూరం వుంది. జూలై 12న ఈ సినిమా విడుదల. ఈ కానీ ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి అప్పుడే సమీక్షించేసారు. విజేత అడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కాస్త సుదీర్ఘమైన ప్రసంగమే చేసారు. ఈ ప్రసంగం అంతా దాదాపుగా విజేత సినిమా మీద సమీక్షగా సాగడం విశేషం.
విజేత తండ్రీ కొడుకుల మధ్య కథ అని, సినిమాలో అనేక ఎమోషన్ సీన్లు వుంటాయని, క్లయిమాక్స్ లో కాస్త కళ్లు చెమరుస్తాయని చిరంజీవి చెప్పుకువచ్చారు. ఈ సినిమాకు తన విజేత సినిమాకు కాస్త పోలికలు కూడా వున్నాయన్నారు. మాళవిక చాలా ఇంటెన్సివ్ గా చేసిందని మార్కులు ఇచ్చారు. కళ్యాణ్ బాగా చేసాడని, డైరక్టర్ బాగా చేయించుకున్నాడని చెప్పుకొచ్చారు.
మురళీశర్మ కు మంచి పాత్ర వచ్చిందని, ఆయన నాజర్, తనికెళ్ల భరణి బాగా చేసారన్నారు. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరక్టర్ హర్షవర్దన్, ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ, ఎడిటర్ అంతా మంచి అవుట్ పుట్ ఇచ్చారన్నారు.
దీన్ని బట్టి చూస్తుంటే, చిరంజీవి సినిమా మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు చూసినట్లే వుంది. అందుకే ప్రసంగంలో దాదాపు సినిమా మొత్తాన్ని సమీక్షించారు. అన్నట్లు అల్లుడు కళ్యాణ్ అందగాడని, గ్లామర్ వుందని మెచ్చుకోవడం కొసమెరుపు.