తెరపై విలన్లను చిత్తు చేయడమే కాదు, తమిళ సినీ రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల్ని చిత్తు చేయడం హీరో విశాల్‌కి వెన్నతో పెట్టిన విద్య. విశాల్ అంటేనే వివాదం.. వివాదం అంటేనే విశాల్.. అన్నట్టుగా తమిళ సినీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రచ్చ సరికొత్తగా తెరపైకి వస్తూనే వుంది. తమిళ సినీ నిర్మాతల మండలిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విశాల్, చాలామందికి 'విలన్'గా మారిపోయాడు.
తాజా వివాదం ఏంటంటే, నిర్మాతల మండలిని విశాల్ సరిగ్గా నడపడంలేదనీ, కోట్లాది రూపాయల మొత్తం దుర్వినియోగం చేస్తున్నాడనీ, అడ్డగోలుగా సినిమాల రిలీజ్‌లకు అనుమతినిచ్చేస్తున్నాడనీ.. కొందరు నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
విశాల్ తీరుకు నిరసనగా, నిర్మాతల మండలి కార్యాలయానికి విశాల్ ప్రత్యర్థులంతా కలిసి తాళాలు వేసేశారు. ఈ రోజు ఆ తాళాల్ని విశాల్ పగలగొట్టేశాడు. ఈ క్రమంలో విశాల్‌కీ, అతన్ని అడ్డుకునేందుకు వచ్చిన విశాల్ వ్యతిరేకులకీ మధ్య రగడ చోటు చేసుకుంది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు విశాల్‌ని, అతని సన్నిహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 'నన్ను అరెస్ట్ చేశారు.. మరి, నిన్న నిర్మాతల మండలి కార్యాలయానికి కొందరు తాళాలు వేస్తున్నప్పుడు పోలీసులు ఏమయ్యారు.?' అని విశాల్ ప్రశ్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో విశాల్‌కి విపరీతమైన మద్దతు లభిస్తోంది.
కాగా, ఒకే రోజు 9 సినిమాల రిలీజ్‌కి విశాల్ లైన్ క్లిర్ చేయడం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో పెను వివాదానికి కారణమయ్యింది. ఇందులో 'కెజిఎఫ్' సినిమా కూడా వుంది. ఈ సినిమా తమిళనాట విశాల్ విడుదల చేస్తున్నాడు.
దాంతో, విశాల్ ప్రత్యర్థులు అతనిపై మరింతగా గుస్సా అవుతున్నారు. ఇప్పటిదాకా తలెత్తిన వివాదాలు ఒక ఎత్తు.. ఈసారి వివాదం ఇంకో ఎత్తు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి విశాల్‌ని తొక్కేయాలన్న దిశగా విశాల్ వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది.
అన్నట్టు, నిన్న మొన్నటిదాకా విశాల్ వర్గంలో వున్న కొందరు నిర్మాతలు సైతం, ఇప్పుడు ప్రత్యర్థి వర్గంలోకి చేరిపోవడంతో.. విశాల్ అండ్ టీమ్ బాగా బలహీనపడినట్లే కన్పిస్తోంది. నిర్మాతల మండలి బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ విశాల్‌పై డిమాండ్ మరింత జోరుగా విన్పిస్తున్న ఈ పరిస్థితుల్లో.. విశాల్ ఏం చేస్తాడు.? ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతాడు.? వేచి చూడాల్సిందే.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్