సైరా Vs వార్.. పోటీలేదు, ప్రభావం మాత్రం ఉంది

చిరంజీవి నటించిన సైరా సినిమాకు, హృతిక్ చేసిన వార్ సినిమాకు నార్త్ లో పోటీతప్పదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సౌత్ లో కూడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంది.…

చిరంజీవి నటించిన సైరా సినిమాకు, హృతిక్ చేసిన వార్ సినిమాకు నార్త్ లో పోటీతప్పదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సౌత్ లో కూడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ లేదని చాలామంది అనుకుంటున్నారు. అయితే పోటీ లేకపోయినా, వార్ ప్రభావం మాత్రం సైరాపై స్పష్టంగా కనిపిస్తోంది.

నైజాం ఏరియానే తీసుకుంటే.. అత్యంత కీలకమైన హైదరాబాద్ లో సైరా సినిమాకు పోటీగా వార్ నిలిచింది. సింగిల్ స్క్రీన్స్ లో సైరాదే పైచేయిగా ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్సుల్లో వార్ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్స్ సంపాదించింది. సైరా విడుదల తేదీ ప్రకటించడానికి ముందే మల్టీప్లెక్సులతో భారీ ఎత్తున ఒప్పందం కుదుర్చుకోవడంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సక్సెస్ అయింది. అది కూడా జాతీయస్థాయిలో కుదుర్చుకున్న డీల్ కావడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య సైరా కొన్ని స్క్రీన్స్ కోల్పోవాల్సి వచ్చింది.

ఒక్క హైదరాబాద్ లోనే వార్ సినిమాకు తొలి రోజు 2 వందలకు పైగా షోలు పడుతున్నాయి. పైగా బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. కాబట్టి ఈ మేరకు సైరా సినిమాపై ప్రభావం పడినట్టే. ఐమ్యాక్స్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సుల్లో సైరాతో సమానంగా వార్ హిందీ వెర్షన్ టిక్కెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కేవలం హైదరాబాద్ లో మాత్రమే. నైజాంలోని ఇతర ముఖ్యమైన సెంటర్లను కూడా కలుపుకుంటే.. వార్ ప్రభావం సైరాపై పడిందనే విషయం అర్థమౌతుంది.

అటు ఏపీలో మాత్రం ఎలాంటి పోటీ లేదు. విశాఖపట్నం, విజయవాడలోని కొన్ని మల్టీప్లెక్సుల్లో మాత్రం వార్ కు చోటుదక్కింది. కాకపోతే హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఏపీలో కాస్త ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలవుతోంది. అయినప్పటికీ అక్కడ సైరాకు వార్, 10శాతం కూడా పోటీ ఇచ్చేస్థాయిలో లేదు. ఎటొచ్చి నైజాంలో మాత్రం వార్ వర్సెస్ సైరా అనేలా ఉంది పరిస్థితి. అటు కేరళ, తమిళనాడులో కూడా వార్ పై సైరాదే పైచేయిగా నిలిచింది. బెంగళూరు సిటీలో మాత్రం మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితే కనిపిస్తోంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు సౌత్ లో సైరా సినిమాకు వార్ అస్సలు పోటీనే కాదు. కాకపోతే నైజాంలో సైరా మొదటి రోజు వసూళ్లపై మాత్రం వార్ ప్రభావం చూపించడం గ్యారెంటీ. అటు ఉత్తరాదిన మాత్రం వార్ సినిమా ఆధిపత్యం క్లియర్ గా కనిపిస్తోంది. 

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!