గీతగోవిందం సినిమా హిట్ అయింది. అంతా బాగుంది. కానీ పంటి కింద రాయిలా నాగబాబు డబ్బింగ్ మాత్రం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. జనాలకు ఎంతో సుపరిచితమైన నాగబాబుకు ఇలా మరొకరు డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులకు అస్సలు ఎక్కలేదు. సరే.. 2-3 సన్నివేశాలే కాబట్టి సరిపెట్టుకున్నారు. మరి అరవింద సమేత సంగతేంటి?
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేతలో నాగబాబుది చిన్నపాత్ర కాదు. గీతగోవిందంలా 3 సీన్లతో లేచిపోయే క్యారెక్టర్ కాదిది. ఎన్టీఆర్ తర్వాత అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి ఇలాంటి ఎక్కువ నిడివి ఉన్న పాత్రకు నాగబాబుకు మరో వ్యక్తి డబ్బింగ్ చెబితే బాగుంటుందా..? సినిమాపై అది ప్రభావం చూపించకుండా ఉంటుందా..?
గీతగోవిందం సినిమా టైమ్ లో నాగబాబుకు గొంతు బాగాలేదు కాబట్టి వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారని సరిపెట్టుకున్నారంతా. కానీ ఆయన వాయిస్ ఇప్పటికీ గాడిన పడలేదు. రీసెంట్ గా వచ్చిన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు.. తాజాగా ఓ న్యూస్ ఛానెల్ లో కనిపించిన నాగబాబు.. తన దెబ్బతిన్న వాయిస్ తోనే ఇబ్బందిపడుతూ మాట్లాడారు. ఇదే ఇప్పుడు అరవింద సమేత యూనిట్ ను టెన్షన్ పెడుతోంది.
ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది అరవింద సమేత చిత్రం. అతి త్వరలో ఈ మూవీ డబ్బింగ్ మొదలుకాబోతోంది. అప్పటికి నాగబాబు వాయిస్ సెట్ అయితే ఓకే, లేదంటే ఈ సినిమాలో కూడా మరో వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాల్సిందే.