తమ సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయిన సందర్భాల్లో చాలామంది హీరోలు బాధపడుతూ ఉంటారు. తాము ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాలు విడుదల కాకపోవడం అంటే ఎవరికైనా బాధే కదా. అసలు విడుదల కాకపోవడం అనేది ఒక బాధ అయితే, సరైన సమయంలో విడుదల కాకపోవడం అనేది మరో బాధ. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా సినిమాలు విడుదల అయినప్పుడే.. అవి విజయం సాధించే అవకాశాలుంటాయి.
సకాలంలో విడుదల సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. సినిమా విజయంలో.. కథా, కథనాల కన్నా.. విడుదల అనేది కూడా చాలా ముఖ్యమైనది అని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి విడుదలలకు సంబంధించి అనేక పంచాయితీలూ సాగుతూ ఉన్నాయి ఈ మధ్య. తమ సినిమాల విడుదల విషయంలో కొంతమంది హీరోలు.. అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. తమ సినిమాలు విడుదల కాకూడదు.. అనేది వీళ్ల కోరిక!
ఏ హీరో అయినా తమ సినిమాలు విడుదల కావాలనే కోరుకుంటారు. అయితే ఈ కోరిక విషయంలో కూడా షరతులు వర్తిస్తాయి అని చెప్పకతప్పదు. కొంతమంది యువహీరోలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిశీలిస్తే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు వరకూ చూసుకుంటే.. పలువురు హీరోలు తమ సినిమాల విడుదల విషయంలో తామే అభ్యంతరం చెప్పిన దాఖలాలున్నాయి.
ముందుగా.. శర్వానంద్ పేరును ఇక్కడ ప్రస్తావించుకోవాలి. కెరీర్ ఉన్నత దశలో ఉన్న ఈ హీరో ఆ మధ్య తన సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పాడు. ఆ సినిమా పేరు 'రాజాధిరాజా'. తమిళంలో చేరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు విడుదల పట్ల శర్వా అసహనం వ్యక్తంచేశాడు. ఈ సినిమాను చేరన్ కథాంశంలో ప్రయోగంగా తీర్చిదిద్డమే కాదు, విడుదల విషయంలో కూడా ప్రయోగం చేస్తానని ప్రకటించాడు అప్పట్లో.
దీన్ని డైరెక్టుగా థియేటర్లలో విడుదల చేయకుండా డీటీహెచ్‌లకు విడుదల చేస్తున్నట్టుగా అప్పట్లో చేరన్ ప్రకటించాడు. అయితే ఈ ప్రయోగం వికటించినట్టుగా ఉంది. తమిళంలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో ఫెయిల్ కావడంతో.. తెలుగులో దీన్ని పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. అలా ఒక ఏడాది పాటు దీన్ని పట్టించుకున్న నాథుడులేడు. ఆ తర్వాత శర్వానంద్ తెలుగు సినిమాలతో బిజీ అయిపోయాడు. కొన్ని హిట్స్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్రత్యేకించి 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి సినిమాలతో శర్వా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వరస ఫెయిల్యూర్ల అనంతరం ఇతడి కెరీర్ మళ్లీ జూమ్‌లోకి వచ్చింది. అప్పుడు మళ్లీ తమిళంలో చేరన్ చేసిన సినిమా తెలుగు విడుదలలో కదలిక వచ్చింది. శర్వా విజయాల మీద ఉండటంతో.. తమిళ సినిమాను తెలుగులో విడుదల చేసుకుని సొమ్ము చేసుకుందామని నిర్మాతలు ఆలోచించారు. అది శర్వాకు ఆగ్రహం తెప్పించింది.
ఏదో కాస్త విజయాల మీద ఉండగా.. కెరీర్‌ను మళ్లీ మలుచుకొంటూ ఉండగా.. పాత గాయాలను రేపడం ఏమిటన్నట్టుగా శర్వా స్పందించాడు అప్పట్లో. అయితే శర్వ అభ్యంతరాలను ఖాతరు చేయక ఆ సినిమా విడుదల కావడం, ఎవరికీ పట్టకుండా పోవడం జరిగింది. చేసేది లేక ఆ సినిమాను లైట్ తీసుకున్నాడు ఈ హీరో. ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లలేదు.
ఇక తెలుగుతో పాటు పక్క భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోలకు ఇలాంటి ముప్పుతిప్పలు తప్పడంలేదు. ఆ మధ్య సందీప్ కిషన్‌కు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. తమిళంలో ఈ హీరో చేసిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై విడుదలలు అవుతూ వచ్చాయి. అవి పక్కా సినిమాలు. తమిళ వాసన కొట్టే సినిమాలు. తెలుగు వాళ్లను ఆకట్టుకోవడం అంటే కష్టమే. అక్కడకూ ఒక సినిమా అనువాదం విషయంలో సందీప్ కష్టపడ్డాడు. అయితే అది ఆడలేదు. ఆ తర్వాత సందీప్ ప్రమేయమే లేకుండా మరో తమిళ సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది.
దానిపై సందీప్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆఖరికి సందీప్ డబ్బింగ్ లేకుండా, వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించి ఆ సినిమాను విడుల చేశారు. ఈ సినిమా విషయంలో సందీప్ తమకు సహకరించలేదని అనువాద హక్కులు కొనుక్కొన్న నిర్మాత బహిరంగంగా వ్యాఖ్యానించాడు. దానిపై సందీప్ వివరణ ఇచ్చాడు. తను డబ్బింగ్ చెప్పాను అని, అయితే అసలు నిర్మాతకు డబ్బింగ్ నిర్మాత డబ్బులు సరిగా చెల్లించలేదని, దీంతో అతడు ఒరిజినల్ ప్రింట్ ఇవ్వలేదని, చివరకు సెన్సార్ ప్రింట్‌నే విడుదల చేశారని.. సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కాస్తా అంతిమంగా డిజాస్టర్ అయ్యింది. అసలే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని ఈ హీరోకి.. ఆ అనువాద సినిమా అలా తలనొప్పిగా నిలిచింది.
ఇక తను చేసిన మలయాళం సినిమా '1971' డబ్బింగ్ విషయంలో అల్లు శిరీష్‌కు కూడా కోపమొచ్చిందని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. అది తెలుగులో విడుదల అవుతున్న మోహన్ లాల్ సినిమాగానే. అయితే అల్లుశిరీష్ ఫొటోను కూడా వాడేస్తూ ఉన్నారు. అసలు హిట్ అత్యవసర దశలో ఉన్నాడు శిరీష్. ఇలాంటి నేపథ్యంలో మలయాళంలో ఫెయిలయిన సినిమా తెలుగులోకి వచ్చి మళ్లీ అదే ఫలితం రిపీట్ అయితే.. ఊరికే మరో ఫ్లాప్ తన ఖాతాలోకి చేరుందని శిరీష్ భయపడి ఉండవచ్చు. అయితే శిరీష్ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా.. ఈ సినిమాను విడుదల చేస్తూ ఉన్నారు. మోహన్ లాల్ ఆ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తూ ఉన్నాడు.
ఇలా ప్రధానంగా డబ్బింగ్ సినిమాలతో హీరోలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెనుకటి రోజుల్లో.. సూర్య, విక్రమ్‌లు తెలుగులో తొలి హిట్స్ కొట్టినప్పుడు.. వాళ్ల తమిళ సినిమాలన్నీ తెలుగులోకి అనువాదం అవుతూ వచ్చాయి. శివపుత్రుడు, అపరిచితుడు సినిమాలు విడుదల అయ్యాకా.. విక్రమ్ తమిళంలో చేసిన సినిమాలన్నింటీని అనువదించి వదిలారు. శివపుత్రుడు, అపరిచితుడుల పేర్లతో ఈ సినిమాలను అమ్మాలని చూశారు, అయితే ఆ ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయి. సూర్య విషయంలో కూడా అదే జరిగింది. ఇతడు శివపుత్రుడు, గజిని సినిమాలకు ముందు చేసిన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి వచ్చాయి. అవేవీ ఆకట్టుకోలేదు.
అనువాదాల విడుదలతో ఇబ్బందులు పడే హీరోల సంగతిలా ఉంటే.. విజయ్ దేవరకొండ వంటి హీరో గతంలో తను ఒప్పకున్న సినిమాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. 'అర్జున్ రెడ్డి' ఈ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇతడి కెరీర్‌ను ఆ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ చేసే సినిమాపై అందరి ఆసక్తీ నెలకొని ఉంది. అయితే.. ఇప్పుడు రాబోతున్న 'ఏం మంత్రం వేశావే' అనే సినిమా ఈ హీరో అర్జున్ రెడ్డి చేయడానికి పూర్వం చేసినది. 'పెళ్లి చూపులు' సినిమాతో హిట్ కొట్టిన వెంటనే విజయ్‌కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
ద్వారక, షికారు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వీటిల్లో అర్జున్ రెడ్డి ఇతడిని ఎక్కడికో చేర్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏదో వచ్చింది కదా.. ఒప్పుకున్న సినిమాలు ఇతడికి తలనొప్పిగా మారాయి. ఈ సినిమాలు తనకు బ్యాక్ లాగ్స్ లాంటివి అని.. వీటిని భరించాల్సిందే అన్నట్టుగా విజయ్ దేవరకొండ వీటిపట్ల మౌనం వహించాడు. ఏతావాతా.. సినిమాల విడుదల హీరోలకు ఆనందాన్ని ఇవ్వడం మాటేమిటో కానీ.. ఒక్కోసారి తలపోటును మాత్రం కలిగిస్తాయని స్పష్టం అవుతోంది.