ఈమధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా నలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. ఓ దర్శకుడిగా డీజే సినిమాను తీసిన హరీష్ అక్కడితో ఆగకుండా కలెక్షన్ల గురించి కెలికాడు. నిర్మాత బాధ్యతలు కూడా తీసుకొని లేనిపోని ట్వీట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పై బాగానే విరుచుకుపడ్డారు నెటిజన్లు. ఇంత జరిగిన తర్వాత సడెన్ గా మాయమయ్యాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.
దిల్ రాజు ఎక్కడుంటే హరీష్ అక్కడుంటాడు. కానీ ఈమధ్య దిల్ రాజు నిర్వహించిన ఏ ఫంక్షన్ లో హరీష్ శంకర్ కనిపించలేదు. చాలామంది దర్శకులు స్టేజ్ పై మాట్లాడారు కానీ, హరీష్ శంకర్ మాత్రం ఏ ఒక్క ఈవెంట్ కు ఎటెండ్ కాలేదు. కొన్నాళ్లు తెరవెనక ఉండమని హరీష్ కు దిల్ రాజే సూచించాడా.. లేక కనిపిస్తే కలెక్షన్ల గురించి అడుగుతారని భయపడి హరీష్ శంకరే పబ్లిక్ ఈవెంట్స్ కు డుమ్మా కొడుతున్నాడా..?
వసూళ్ల విషయంలో దువ్వాడ జగన్నాథమ్ సృష్టించిన వివాదాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మొన్నటికి మొన్న ఫిదా ప్రమోషన్ లో కూడా నిర్మాత దిల్ రాజును డీజే గురించే అడిగింది మీడియా. ఇలాంటి టైమ్ లో మళ్లీ తెరపైకొస్తే వివాదాలు మరింత ముదిరే అవకాశముంది. అందుకే హరీష్ శంకర్ కెమెరాకు కనిపించడం మానేశాడు.
అటు అల్లు అర్జున్ దీ ఇదే పరిస్థితి. బయటకు రావడం మానేశాడు. కాకపోతే తన కొత్త సినిమా వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. మరి హరీష్ ఏం చేస్తున్నట్టు. దిల్ రాజు బ్యానర్ లోనే నెక్ట్స్ సినిమా చేస్తానని ప్రకటించిన ఈ దర్శకుడు కొత్త కథలు రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడా.. లేక డీజే లెక్కలు చెప్పాల్సి వస్తుందని దాక్కున్నాడా..?