డ్రగ్స్ ముసుగులో దాగుడు మూతల దండాకోర్!

నోటీసుల తర్వాత పేర్లను దాచడంలో మతలబేంటి? Advertisement ఒక నేరం జరుగుతుంది… లేదా ఒక అవినీతి బాగోతం బయటపడుతుంది…. చట్టసభ సభ్యుడైన ఒక ఎమ్మెల్యే లేదా గౌరవనీయులైన ఒక మంత్రి దానికి బాధ్యుడు అని…

నోటీసుల తర్వాత పేర్లను దాచడంలో మతలబేంటి?

ఒక నేరం జరుగుతుంది… లేదా ఒక అవినీతి బాగోతం బయటపడుతుంది…. చట్టసభ సభ్యుడైన ఒక ఎమ్మెల్యే లేదా గౌరవనీయులైన ఒక మంత్రి దానికి బాధ్యుడు అని తెలుస్తుంది…. విచారణ అధికారులు ఆయనకు నోటీసులు పంపుతారు. సదరు ప్రజాప్రతినిధి ఎవరు? ఆయన పేరేమిటి? ఆయనకు ఎందుకు నోటీసు పంపారు?… ఈ వివరాలన్నీ ఆటోమేటిగ్గా బయటకు వస్తాయి. విచారణాధికారులు బహిరంగంగానే.. ప్రజాప్రతినిధుల పేర్లను వెల్లడించి… వారికి నోటీసులు పంపుతారు. అందులో దాపరికం ఎంతమాత్రమూ ఉండదు.

ఇప్పుడు హైదరాబాదు నగరంలో సెలబ్రిటీల ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారాన్ని గమనిస్తే… సినిమా సెలబ్రిటీలు లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, చట్టసభల సభ్యులకంటె మహానుభావులా?  గొప్పవాళ్లా? వారి ‘ఐడెంటిటీ’ని కాపాడడం అనేది విచారణాధికారులు తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నారా? అనే సందేహం తొలిసారిగా కలుగుతోంది. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత  కూడా వారి పేర్లను మీడియాకు విడుదల చేయకుండా పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారో? వారి వివరాలు బహిర్గతం కాకుండా కాపాడడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారో అర్థం కావడం లేదు. అందులో ఏమైనా మతలబు దాగిఉన్నదేమో కూడా తెలియదు…!

ఎంతో జనాదరణ ఉండే సినిమా ఇండస్ట్రీకి ముడిపెట్టి.. డ్రగ్స్ కేసు బయటపడిన తర్వాత.. రాష్ట్రంలో ప్రజలు, యువత ప్రధానంగా పనులన్నీ పక్కన పెట్టి దీని గురించే మాట్లాడుకునే విధంగా పోలీసుల దాగుడుమూతలు ప్రేరేపిస్తున్నాయి. ఏ ఇద్దరు కుర్రాళ్లు కలిసినా.. ‘‘ఇప్పుడు అవకాశాల్లేకుండా పడిఉన్న మాస్ హీరో ఎవరు?’’ ‘‘కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్ర నిర్మాతగా ఎదిగింది ఎవరు?’’ అందరికీ జవాబులు తెలిసిన ప్రశ్నల గురించే మళ్లీ మళ్లీ చర్చించుకుంటున్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు పేర్ల విషయంలో పోలీసులు ఎందుకు గోప్యత పాటించాలి? అనే ప్రశ్న విశ్లేషకుల్ని తొలిచివేస్తున్నది. నోటీసులు ఇచ్చినంత మాత్రాన నేరం చేసినట్టుగా తేల్చినట్టు కాకపోవచ్చు. అంతమాత్రాన వారు నేరంతో ఏమాత్రం సంబంధం లేనివారు అని తేల్చినట్టు కూడా కాదు. నోటీసులు ఇవ్వడం అనేది.. విచారణ ఒక దశ వరకు పూర్తయిన తర్వాత మాత్రమే జరుగుతంది. ఆ దశలో ఇంకా గోప్యత ఎందుకు పాటించాలి? అంటే, సదరు సెలబ్రిటీల పరువును కాపాడడానికి పోలీసులు పూచీ తీసుకుంటున్నారా? అందుకోసం ఏదైనా లోపాయికారీ ఒడంబడికలు చేసుకుంటున్నారా? అనే సందేహాలు ప్రజలకు కలిగితే తప్పేముంది?

ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా సరే లెక్కలేకుండా నోటీసులు ఇస్తే వివరాలు బయటపెట్టే పోలీసులు సినిమా సెలెబ్రిటీలను , డ్రగ్స్ దొంగల పరువును కాపాడడానికి ఎందుకు ప్రయత్నించాలి? వీరి తీరు చూస్తే 19నుంచి ప్రారంభం కానున్న విచారణను కూడా రహస్యంగా… ఎవ్వరికీ ఆ సమాచారం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తారేమో అనికూడా అనుమానాలు కలుగుతున్నాయి.

ఈసారి బయటకు వచ్చిన వివరాలతో పోలీసులు చాలా గట్టిగానే గుట్టుమట్టులు విప్పుతున్నారు. అందుకు అభినందించాల్సిందే. కానీ, పేర్లు బయటపెట్టకుండా, మీడియాలో పిచ్చి పిచ్చి ఊహాగానాలకు ఆస్కారం ఇస్తూ వారు ఆడుతున్న దాగుడుమూతల మతలబే బోధపడడం లేదు. ఈ సందిగ్ధ ప్రచారాలకు తెరదించి, పోలీసులు తమ చిత్తశుద్ధిని మరింత స్పష్టంగా నిరూపించుకుంటే బాగుంటుంది.