సరిలేరు నీకెవ్వరూ.. సూపర్ స్టార్ మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో లుక్ లు రెండు మూడు వచ్చాయి. మళ్లీ దీపావళి సందర్భంగా ఇంకోటి రాబోతోంది. అది కూడా సోలో లుక్ నే. ఇవికాక సినిమాలో కీలకపాత్ర ధారి విజయశాంతి లుక్ కూడా బయటకు వదిలారు.
విజయశాంతి లుక్ బయటకు వదలడం అన్నది ప్యూర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి అభిమతం అని తెలుస్తోంది. ఏరికోరి, ఒప్పించి మరీ విజయశాంతిని ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చింది అనిల్ నే. అందుకే మీడియాలో విజయశాంతికి కూడా సముచిత ప్రాధాన్యం వుండేలా ఆయన మొదటి నుంచీ జాగ్రత్త పడుతున్నారు.
అందులో భాగంగానే హీరోను, యూనిట్ ను ఒప్పించి విజయశాంతి స్టిల్ ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఓకె. విజయశాంతి సీనియర్ లేడీ సూపర్ స్టార్ కు ఆ మాత్రం ప్రాధాన్యత, గౌరవం దక్కాల్సిందే. కానీ హీరోయిన్ రష్మిక సంగతేమిటి? ఇప్పటి వరకు ఆమె లుక్ బయటకురాలేదు.
రష్మిక సినిమాలో ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. తమన్నా, మెహరీన్ ల చేత లుంగీలు కట్టించి, మాస్ డ్యాన్స్ లు చేయించిన డైరక్టర్ అనిల్ ఈసారి రష్మికను ఎలా చూపించబోతున్నారు అన్నది పాయింట్. పైగా రష్మికను తీసుకున్నపుడు కాస్త అభ్యంతరాలు ఫ్యాన్స్ వైపు నుంచి వినిపించాయి. మహేష్ సరసన రష్మిక సూట్ అవుతుందా? అన్న కామెంట్లు అప్పట్లో వినిపించాయి.
వీటన్నింటికి సమాధానం రష్మిక లుక్ విడుదల చేస్తే దొరకుతుంది. కానీ ఆ లుక్ మాత్రం ఇప్పట్లో విడుదల చేసేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పట్లో మరే ఫెస్టివల్, మరే అకేషన్ లేదు. అంటే డిసెంబర్ వచ్చి ప్రచారం స్టార్ట్ చేస్తే తప్ప రష్మిక లుక్ కనిపించే అవకాశం లేనట్లే అనుకోవాలి.