పెద్ద సినిమా నిర్మాతలు ఆదికి ముందే డేట్లు ప్రకటించేస్తున్నారు. సినిమా ఇంకా ఓ పక్క షూటంగ్ ల్లో వుండగానే విడుదల తేదీని ప్రకటించేస్తున్నారు.గతంలో ఇలాంటి వ్యవహారం ఒక్క బండ్ల గణేష్ కే వుండేది. ఆయన తాజాగా తన ఎన్టీఆర్ సినిమాకు జనవరి 9 అని కొబ్బరికాయ కొట్టిననాడే ప్రకటించేసారు.
ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు ఫిబ్రవరి 5 అని తేదీ ప్రకటించేసారు. అంతకు ముందే గోపాల గోపాల సంక్రాంతి విడుదల అని చెప్పేసారు. మరోపక్క డిసెంబర్ ఆఖరుకు ముకుంద డిసైడ్ అయిపోయింది. ఇలా పెద్ద సినిమాలన్నీ వారం వారం గ్యాప్ ఇచ్చి ముందుగానే విడుదలకు తేదీలు ప్రకటించేసుకుంటున్నాయి.
దీంతో అసలు ఇక చిన్న సినిమాలకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అన్నది లేకుండా పోయింది. సినిమాల సీజన్ అయిన డిసెంబర్ ఆఖరు నుంచి ఫిబ్రవరి తొలివారం వరకు ఒక్క చిన్న సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదు. చిన్న సినిమాలకు ఫైనాన్స్ అన్నది చాలా పెద్ద సమస్య. మూడు నెలల పాటు వడ్డీలు కట్టుకుంటూ సినిమాను పక్కన పెట్టుకుని కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు.
డబ్బింగ్ సినిమాలను పండుగకు రాకూడదని ఆంక్షలు పెడుతూ, పెద్ద సినిమాల లాభాల కోసం ఆలోచిస్తున్న చాంబర్, జనవరిలో కనీసం ఒక వారాన్ని అయినా చిన్న సినిమాల కు కేటాయిస్తే మంచిది కదా?