రాష్ట్రంలో మీడియా చాలా వరకు పార్టీల వారీగా ఏనాడో విడిపోయింది. అయితే మెజారిటీ మీడియా వివిధ ఈక్వేషన్ల కారణంగా తెలుగుదేశం పార్టీకి అండగానే వుంది. కేవలం సాక్షి అండతో వైకాపా బండి లాక్కుంటూ వస్తోంది. అందుకే ఈసారి ఈ ఎన్నికల నేఫథ్యంలో మరో ఛానెల్ ఒకటి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానెల్ వైకాపాకు అనుకూలంగా వుండే అవకాశం వుంది.
వైకాపాతో సన్నిహిత రాజకీయ సంబంధాలు వున్న ఓ ఎన్నారై ఈ ఛానెల్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీడియాతో కాస్త మమేకం అయిన ఆయన వైకాపా స్ట్రాంగ్ సపోర్టర్ గా వున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా వున్నట్లు వినికిడి.
అందుకే ఆయన ఓ ఛానెల్ కూడా స్టార్ట్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఎన్నికల దగ్గర చేసి కేవలం పార్టీలకు మద్దతుగా వెబ్, విజువల్ మీడియాలోకి మరి కొంతమంది రంగ ప్రవేశం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని వినికిడి. మొత్తంమీద ఎన్నికల్లో పార్టీల మధ్యే కాదు, మీడియా మధ్య కూడా కాస్త గట్టిపోటీ వుండేలాగే వుంది.