2021 రౌండప్: సెలబ్రిటీ పెళ్లిళ్లు.. పెటాకులు

గతేడాదిలానే ఈ ఏడాది కూడా సెలబ్రిటీ పెళ్లిళ్లు బాగానే జరిగాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నుంచి టాలీవుడ్ కండల వీరుడు కార్తికేయ వరకు చాలామంది 2021లో పెళ్లి పీటలెక్కారు. లిస్ట్ లో…

గతేడాదిలానే ఈ ఏడాది కూడా సెలబ్రిటీ పెళ్లిళ్లు బాగానే జరిగాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నుంచి టాలీవుడ్ కండల వీరుడు కార్తికేయ వరకు చాలామంది 2021లో పెళ్లి పీటలెక్కారు. లిస్ట్ లో ఈసారి కొన్ని సర్ ప్రైజ్ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది ఖరీదైన పెళ్లిగా గుర్తింపు పొందింది కత్రినా-విక్కీ కౌశల్ వెడ్డింగ్. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఎట్టకేలకు 2021లో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా-విక్కీ వివాహం అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్లికి హాజరయ్యారు.

ఇలాంటిదే ఓ చిన్నపాటి సందడి టాలీవుడ్ లో కూడా కనిపించింది. హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యాడు. ఇలా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి, అలా పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

2021లో పెళ్లి చేసుకున్న హీరోల జాబితాలో సుమంత్ అశ్విన్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ శివార్లలో ఉన్న తన తండ్రి ఎమ్మెస్ రాజు ఫామ్ హౌజ్ లో ఈ వివాహ వేడుక సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. అతి తక్కువ మంది అతిథులు హాజరైన ఈ పెళ్లి వేడుకలో.. దీపిక మెడలో మూడు ముళ్లు వేశాడు సుమంత్ అశ్విన్. అమెరికాలోని డాలస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తోంది దీపిక. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం.

ఈ ఏడాది సర్ ప్రైజ్ పెళ్లి ఏదైనా ఉందంటే అది హీరోయిన్ ప్రణీతదే. ఎలాంటి చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వ్యాపారవేత్త నితిన్ రాజును, అతడి ఫామ్ హౌజ్ లోనే సింపుల్ గా పెళ్లాడింది. కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు ఈ పెళ్లికి. తనకు పెళ్లయిందనే విషయాన్ని ప్రణీత బయటపెట్టేవరకు మీడియాకు పొక్కలేదంటే, ఎంత సీక్రెట్ గా జరిగిందో అర్థంచేసుకోవచ్చు. కరోనా/లాక్ డౌన్ వల్ల అనుమతులు రాకపోవడంతో, తను ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటూ తర్వాత ప్రకటించింది ప్రణీత.

ప్రణీత తర్వాత ఆ రేంజ్ లో సీక్రెట్ గా జరిగిన పెళ్లి దియా మీర్జాది. ముంబయికి చెందిన వైభవ్ రేఖిని రహస్యంగా పెళ్లాడింది దియా. వాళ్లిద్దరి పెళ్లి చాలా గుంభనంగా జరిగిపోయింది. ఇంతకుముందు సాహిల్ సంఘ అనే బిజినెస్ మేన్ ను పెళ్లాడిన దియా.. అతడితో 11 ఏళ్లు కాపురం చేసి 2019లో విడిపోయింది. అలా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ ఏడాది వైభవ్ ను పెళ్లాడింది. మాల్దీవులకు వీళ్లిద్దరూ హనీమూన్ కు వెళ్లిన వరకు పెళ్లయిందనే విషయమే బయటకు రాలేదు.

లాంగ్ టైమ్ లవ్ కపుల్ గుత్తా జ్వాల, విష్ణు విశాల్ కూడా ఈ ఏడాది ఓ ఇంటివారయ్యారు. తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరూ.. 2020లో తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే టైమ్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో వీళ్ల పెళ్లి లాంఛనంగా జరిగింది. ఇటు జ్వాల, అటు విష్ణు విశాల్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.

గాయని సునీత, రామ్ వీరపనేని (మ్యాంగో రామ్) ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా వీళ్ల పెళ్లిపై ఊహాగానాలు చెలరేగగా.. ఈ ఏడాది ప్రారంభంలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు సునీత. ఆ వెంటనే పెళ్లి తంతు కూడా పూర్తయింది. శంషాబాద్ కు దగ్గర్లో ఉన్న ఓ రామాలయంలో రామ్-సునీత పెళ్లి సింపుల్ గా జరిగింది.

ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకున్న ప్రముఖుల్లో యామీ గౌతమ్, వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావు కూడా ఉన్నారు. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న యామీ గౌతమ్, ఆదిత్య ధర్ పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక వరుణ్ ధావన్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను పెళ్లి చేసుకున్నాడు. అటు రాజ్ కుమార్ రావు కూడా 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు పత్రలేఖను పెళ్లాడాడు.

పెళ్లిళ్లతో పాటు.. పెటాకులు కూడా సంచలనమే

ఈ ఏడాది సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రమే కాదు.. వాళ్ల విడాకుల వ్యవహారాలు కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇందులో ముందువరసలో నిలుస్తుంది నాగచైతన్య-సమంత జంట. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. తామిద్దరం విడిపోతున్నట్టు చైతూ-శామ్ అధికారికంగా ప్రకటించారు. అలా 2021 సంవత్సరం నాగచైతన్య, సమంత జీవితాల్ని వేరుచేసింది.

అటు అమీర్ ఖాన్ కూడా తన భార్యకు విడాకులిచ్చాడు. తామిద్దరం ఓ అవగాహనతో విడిపోతున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ప్రకటించారు. అలా తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి వీళ్లు ముగింపు పలికారు. కొడుకు ఆజాద్ కోసం మాత్రమే తామిద్దరం తల్లిదండ్రులుగా ఉంటామని, భార్యాభర్తలుగా మాత్రం కొనసాగలేమని విస్పష్టంగా ప్రకటించారు.

ఇక పెళ్లి కాకుండానే పెటాకులైన వ్యవహారాలు కూడా ఈ ఏడాది ఉన్నాయి. త్వరలోనే భర్తతో కలిసి ఏడడుగులు వేస్తుందనుకున్న మెహ్రీన్ తన పెళ్లిని రద్దు చేసుకుంది. భవ్య బిష్ణోయ్ తో తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది. ఇకపై తనకు భవ్యకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పేసింది. అందరి సమ్మతంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై భవ్య కుటుంబంతో తనకు సంబంధం లేదని చెప్పేసింది. అటు భవ్య కూడా దాదాపు ఇలానే ప్రకటించి పెళ్లి రద్దయిన విషయాన్ని ధృవీకరించాడు.

మాజీ విశ్వసుందరి సుశ్మితాసేన్ కూడా తన లవ్ ను బ్రేకప్ చేసుకుంది. చాన్నాళ్లుగా రోహమన్ షాల్ తో డేటింగ్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ, ఇప్పుడు అతడికి గుడ్ బై చెప్పేసింది. నిజానికి సుశ్మితకు వైవాహిక బంధంపై నమ్మకం లేదు. కానీ రోహమన్ తో డేటింగ్ చూసిన తర్వాత ఈమె పెళ్లి చేసుకుంటుందని చాలామంది అనుకున్నారు. కానీ 2021 ఏడాది ఆమెకు బ్రేకప్-ఇయర్ గా మిగిలింది.

ఇక ఎప్పట్లానే ఈ ఏడాది కూడా కొంతమంది సెలబ్రిటీలు పెళ్లికి దూరంగా ఉన్నారు. ప్రభాస్ ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోలేదు. అనుష్క కూడా అంతే. ఇక నయనతార-విఘ్నేష్ ఇంకా లవర్స్ గానే కొనసాగుతున్నారు. 2021లో వాళ్లు భార్యాభర్తలుగా మారలేదు. హీరోయిన్లు రకుల్, పాయల్, అవికా గౌర్ కూడా ప్రస్తుతానికి ప్రేమలోనే ఉన్నారు. ఇంకా పెళ్లిపీటలు ఎక్కలేదు.