ప‌థ‌కాల‌తో ప‌ని జ‌ర‌గ‌దంటున్న ప్ర‌ముఖ న‌టి

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిలో వైద్యానికి అత్యంత ప్రాధాన్య‌త పెరిగింది. ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు బెడ్స్‌, ఆక్సిజ‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తే చాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో…

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిలో వైద్యానికి అత్యంత ప్రాధాన్య‌త పెరిగింది. ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు బెడ్స్‌, ఆక్సిజ‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తే చాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. 

క‌రోనా వ‌ల్ల ఆర్థికంగా న‌ష్టం వాటిల్లుతున్నా, తాను ముందు ప్ర‌క‌టించిన‌ట్టు సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌ర్వంగా చెబుతోంది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల కంటే, ఆక్సిజ‌న్ , ఆస్ప‌త్రిలో బెడ్స్  ఇప్పిస్తే, అదే ప‌దివేల‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌ముఖ న‌టి రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క వ్యాఖ్య చేశారు. ప్ర‌స్తుతం దేశానికి సోనూసూద్ లాంటి వ్య‌క్తి అవ‌స‌ర‌మ‌న్నారు. ప‌థ‌కాల‌తో ప‌ని జ‌ర‌గ‌ద‌ని రేణూ తేల్చి చెప్పారు. ఒక వ్య‌క్తికి నిజ‌మైన అవ‌స‌రం ఏంటో తెలుసు కుని దాన్ని అందించాల‌ని ఆమె కోరారు.  

ప్రస్తుత ప‌రిస్థితుల్లో త‌న‌కు  రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని వారికి కూడా త‌న వంతు సాయం చేస్తాన‌ని మ‌రోసారి ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కూ  600 మంది క‌రోనా బాధితుల‌కు త‌న‌ వంతు సహకారం అందించిన‌ట్టు రేణూ తెలిపారు. ఈ క్ర‌మంలో రోజుకు 14 గంటలు ఫోన్‌లో మాట్లాడ్డానికే స‌రిపోతోంద‌న్నారు. 

కుమారుడు అఖీరా, కుమార్తె ఆద్య  కూడా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌కు మద్దతు ఇస్తున్న‌ట్టు రేణూ దేశాయ్ తెలిపారు. అలాగే మ‌రో ముఖ్య‌మైన విజ్ఞ‌ప్తి కూడా చేశారు. దయచేసి ఎవరూ కరోనా మరణానికి సంబంధించి, అలాగే ఆందోళన కలిగించే వార్తలు చదవొద్దని రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చారు.