కోలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్‌పై స్థానిక తమిళ పత్రికలో వచ్చిన ఓ చిన్న వార్త పెద్ద దుమారాన్నే క్రియేట్ చేసింది. విక్రమ్ అభిమానులను నిరాశ పరిచేలా ఉన్న ఆ వార్తపై చివరికి విక్రమ్ పీఆర్వో కల్పించుకుని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న వార్తైనా సరే…ఎంత ప్రభావం చూపుతుందో ఈ వార్తే నిదర్శనం. వివరాల్లోకి వెళ్దాం.
కోలీవుడ్‌లో ప్రముఖ నటుడైన విక్రమ్‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. త్వరలో విక్రమ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నారనే వార్త ఆయన అభిమానుల్లో అలజడి రేకెత్తించింది. ప్రస్తుతం కోబ్రా సినిమాలో నటిస్తున్న విక్రమ్…అది పూర్తయిన వెంటనే పూర్తిగా బ్రేకప్ తీసుకుని, తన కుమారుడు ధ్రువ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టనున్నట్టు తమిళంలో ఓ చిన్నపత్రికలో వార్త ప్రచురితమైంది.
ఈ వార్త విక్రమ్ అభిమానుల్లో రెండు రకాల ఎమోషన్స్‌ను క్రియేట్ చేసింది. తమ అభిమాన నటుడు ఇక సినిమాల్లో కనిపించరనే బాధ, మరోవైపు తమ అభిమాన నటుడి కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారనే ఆనందం…మొత్తానికి ఆశ్చర్యం, ఆందోళనకు గురైన వారే ఎక్కువ. విక్రమ్ సినిమాల్లో కొనసాగాల్సిందేనంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
ఈ విషయమై విక్రమ్ పీఆర్వో ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఇకపై విక్రమ్ సినిమాల్లో నటించరనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. అలాగే కోబ్రా సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారన్నాడు. ఇవే కాకుండా విక్రమ్ సినిమాల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడిస్తామన్నాడు. దీంతో విక్రమ్ అభిమానులు శాంతించారు.