తన కొత్త సినిమా షూటింగ్ లో హీరో విక్రమ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తంగళాన్ అనే సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీన్ సమయంలో విక్రమ్ కు ప్రమాదం జరిగింది. అతడి పక్కటెముకల్లో ఫ్రాక్చర్ అయింది.
దీంతో హుటాహుటిన చెన్నైలోని ఓ హాస్పిటల్ లో విక్రమ్ ను జాయిన్ చేశారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. మళ్లీ ఇన్నాళ్లకు విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ వచ్చింది.
దర్శకుడు పా రంజిత్ చెబుతున్న ప్రకారం, విక్రమ్ తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు, ఈనెల 15 నుంచి తంగళాన్ చివరి షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 12 రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ లో ఉంది. అనుకున్న టైమ్ కంటే ముందే విక్రమ్ త్వరగా కోలుకున్నాడని తెలిపాడు పా రంజిత్.
పొన్నియన్ సెల్వన్-2 ప్రచారం తర్వాత, తంగళాన్ సెట్స్ పైకి వచ్చాడు విక్రమ్. వచ్చిన రెండో రోజే యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఈ గ్యాప్ లో పీఎస్2 థియేట్రికల్ రన్ ముగియడంతో పాటు, ఆ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. విక్రమ్ కోలుకోవడంతో, అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.