అడుసు తొక్కనేల.. కాళ్లు కడగనేల అన్నది వెనకటి సామెత. ఓ మంచి మెసేజ్, ఈ తరం నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ.. వున్న సబ్జెక్ట్ వినోదయ సితం. ఆ సబ్జెక్ట్ ను తీసుకుని తెలుగులో సినిమా చేయాలనుకున్నారు.
కానీ తమిళంలో లేని రాజకీయ పైత్యాన్ని సినిమాలో రంగరించి పోసింది ఎవరు? దేవుడి పాత్రను పరిచయం చేస్తూనే ‘దోచేస్తాం.. దాచేస్తాం.. అనే పొలిటికల్ డైలాగులు వినిపించింది ఎవరు? చిటికెలో పట్టుకుపోతా అన్న బీరాల మాటలు దేవుడి నోట మాట్లాడించింది ఎవరు? దేవుడు పబ్ లో కూర్చుని, శ్యాంబాబు అంటూ అన్యాపదేశంగా పొలిటికల్ కామెడీలు చేసేలా చేసింది ఎవరు? అలా చేసింది విమర్శకు గురయితే, తమని కావాలని రాజకీయ కోణంలో టార్గెట్ చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నది ఎవరు?
ఓ మంచి విషయం చక్కగా చెప్పే ప్రయత్నం మానేసి, దేవుడి పాత్రను అడ్డం పెట్టుకుని, తమ చిత్తానికి చేసుకుంటూ పోతే జనం సినిమాను పక్కన పెట్టారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వాస్తవ కలెక్షన్ల నెంబర్లే దీనికి నిలువెత్తు అద్దం. మూడు రోజులు దాటగానే మండే నాడు రెండు రాష్ట్రాల్లో బిళ్ల బీటుగా సినిమా కలెక్షన్లు జారిపోయాయి. ఎందువల్ల? ఎవరు నెగిటివ్ చేస్తే?
భీమ్లా నాయక్ నో, వకీల్ సాబ్ నో లేదంటే రేపు రాబోయే ఉస్తాద్ నో ఎన్ని పొలిటికల్ డైలాగులు కొట్టినా తప్పు పట్టే పని లేదు. కానీ దేవుడి క్యారెక్టర్ ఓ పర్పస్ కోసం నేలకు దిగివచ్చేది రాజకీయడైలాగులు వల్లె వేయడానికా?
ఇక్కడ ఓ గమ్మత్తు విషయం చెప్పుకోవాలి. బ్రో లో వున్న ఒకే ఒక ఫైట్ సీన్ లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా పాల్గొనాల్సి వుంది. దానికోసం ముందు రెండు రోజులు, తరువాత ఒక రోజు కేటాయించారు కూడా. కానీ లాస్ట్ మినిట్ లో దేవుడి పాత్ర ఫైట్ ఏమిటి అనే అభ్యంతరం పవన్ చెప్పారని గ్యాసిప్ లు వినిపించాయి. మరి దేవుడి పాత్రకు ఫైట్ ఏమిటి అన్న హీరో, దేవుడి పాత్రకు రాజకీయ డైలాగులు ఏమిటి? అని అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటి?
సినిమా బాగుందా లేదా అన్నది పాయింట్ కాదు. జనాలకు నచ్చాలి. అది మంచిదైనా, మరోటి అయినా. జనానికి నచ్చితే చాలు ఎవరు అడ్డం పడినా ఆగదు. అలా అని జనానికి నచ్చిన ప్రతీదీ గొప్ప సినిమా అయిపోదు. హిట్ సినిమా అవుతుందంతే. జనాలకు నచ్చకుండా చేసేసారు అంటూ గోల పెట్టినంత మాత్రాన ఫెయిల్ అయిన సినిమా గొప్పది అయిపోదు. ఫ్లాపు సినిమాగానే రికార్డుల్లో వుండిపోతుంది.
ఇవన్నీ వదిలేసి, సినిమా ఆడకపోవడానికి విమర్శలే కారణం అనుకుంటే ఏమనాలి?