ఆదిపురుష్ : ‘చూడామణి’ అంటే ఓంరౌత్‌కు తెలుసా?

సీతమ్మను వెతకడానికి వానరమూకను, సుగ్రీవుని అనుచరులను అన్ని దిక్కులకు పంపించారు. కానీ, హనుమంతుడి మీద రాముడికి అపారమైన నమ్మకం ఉంది. అందుకే సీతమ్మ ఆచూకీ తెలుసుకోగలడన్న ఆశతో.. ఒకవేళ ఆమె కనిపిస్తే రాముడి దూతనని…

సీతమ్మను వెతకడానికి వానరమూకను, సుగ్రీవుని అనుచరులను అన్ని దిక్కులకు పంపించారు. కానీ, హనుమంతుడి మీద రాముడికి అపారమైన నమ్మకం ఉంది. అందుకే సీతమ్మ ఆచూకీ తెలుసుకోగలడన్న ఆశతో.. ఒకవేళ ఆమె కనిపిస్తే రాముడి దూతనని తెలియజెప్పేందుకు తన అంగుళీయకాన్ని (ఉంగరాన్ని) హనుమంతుడి చేతికి ఇచ్చారు. 

హనుమంతుడు లంక చేరుకుని సీతమ్మను గుర్తించిన తర్వాత, రాముడి క్షేమాన్ని ఆమెకు తెలియజేసి ఆ ఉంగరం ఆమెకు ఇచ్చి నమ్మకం కలిగించాడు. అలాగే తిరిగి రాముడికి తన ఆనవాలుగా ఇవ్వడానికి సీతమ్మ తన చూడామణిని తీసి హనుమంతుడి చేతికి ఇచ్చింది. దానిని హనుమంతుడు తిరిగి రాముడి చెంతకు చేర్చాడు. ..ఇది మనకు రామాయణంలో కనిపించే దృష్టాంతం.

కానీ, ఆదిపురుష్ ట్రైలర్ చూస్తే మనకు తేడా కొడుతుంది. తన చేతికి రాముడి ఉంగరం అందించిన హనుమంతుడికి.. సీతమ్మ చేతి గాజును తీసి ఇవ్వడం, హనుమంతుడు ఆ గాజును రాముడి చేతిలో పెట్టడం చాలా స్పష్టంగా ట్రైలర్లలో చూపించారు. రాముడికి తన ఆనవాలుగా సీతమ్మ చేతిగాజు ఇచ్చినట్టుగా ఏ రామాయణంలో ఉంది? ఏ ఆధారాలతో చూడామణి బదులుగా చేతిగాజును ఈ సినిమాలో చూపించారో అర్థం కాదు.

రామాయణ కథకు సంబంధించి ఎన్ని గ్రంథాలు, వాదనలు ఉన్నప్పటికీ.. వాల్మీకి రామాయణం అనేది అన్నింటికీ మూలం అని మనం అంగీకరించాలి. రావణుడిని హీరోగా చూపించాలని అనుకుంటే.. ఏదో ఒక రామాయణ కథను ఆధారంగా చేసుకున్నామని చెప్పుకున్నా సరిపోతుంది గానీ.. ఆదిపురుష్ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం చేస్తున్నప్పుడు వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా ఉంటేనే కరెక్టు. వాల్మీకి రామాయణంలో, సీత చూడామణిని హనుమంతుడి చేతికి ఇచ్చే సన్నివేశంలో, సీతమ్మ రాముడిని ఉద్దేశించి అన్నట్టుగా.. ఇలాంటి ఓ శ్లోకం ఉంటుంది..

‘‘ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః

ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామివానఘ’’

‘‘ఏష నిర్యాతిత శ్శ్రీమాన్ మయా తే వారిసంభవః

అతః పరం న శక్ష్యామి జీవితుం శోకలాలసా’’

అంటుంది. ‘‘ఈ దివ్య చూడామణిని నేను ఇంత వరకు కాపాడుకుంటూ వచ్చాను. ఈ దుఃఖ సమయంలో కూడా దీనిని చూసినప్పుడెల్లా.. నిన్నే చూసినట్లు సంతోషపడుతూ ఉన్నాను. రత్నాకరమునందు పుట్టి మిలమిలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుతున్నాను. శోకమగ్ననైన నేను ఇదిలేకుండా జీవించజాలను’’

అని ఈ రెండు శ్లోకాల భావం. చూడామణి అంటే స్త్రీలు అలంకారం కోసం తలలో ఉంచుకునే రత్నాభరణం. చూడామణి అంటే చేతి గాజు కాదు.

రత్నాకరము (అంటే సముద్రం)లో పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు వరుణుడికి ఇవ్వగా, అతడు జనకమహారాజుకు ఇచ్చాడని, ఆయన ఆ మణిని తన భార్య ద్వారా దశరథుని సమక్షంలో కూతురు సీతాదేవికి వివాహసమయంలో ఇచ్చాడని కూడా రామాయణం చెబుతుంది.

వాల్మీకి రామాయణంలో అంత స్పష్టంగా ఉండగా.. సీతమ్మ చూడామణిని హనుమ చేతికి ఇచ్చి పంపిందనేది లోకవిదితమైన సంగతి కాగా, ఆదిపురుష్ లో దానిని చేతిగాజుగా ఎందుకు చిత్రీకరించారో అస్సలు బోధపడని సంగతి. ట్రైలర్ చూస్తే ఈ సంగతి తెలుస్తుంది.. రామాయణంలోని ఇంకెన్ని సంగతులను రకరకాలుగా ఈ సినిమాలో వక్రీకరించి ఉంటారో అసలు సినిమా విడుదల అయితే గానీ అర్థం కాదు.