నిహారిక కొణిదెల…మెగా వారసురాలు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనయ నిహారిక. సహజంగా హీరోల కుటుంబాల నుంచి వారసత్వంగా అమ్మాయిలు రావడం చాలా తక్కువే. అలాంటిది మెగాస్టార్ కుటుంబం తన ఆడబిడ్డను కథా నాయికగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం గొప్పేనని చెప్పుకోవాలి. ఒక మనసు సినిమాతో మెగా మనసులను దోచుకున్నారామె.
హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించారామె. మెగా వారసురాలిగా టాలీవుడ్‌లో ప్రవేశించినప్పటికీ, అది ఎంట్రీ పాస్‌గానే భావించారు. ఆ తర్వాత నటనలో ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. 2019లో తన పెదనాన్న నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత నిహారిక తెలుగులో నటించలేదు. పెదనాన్న చిత్రంలో చిన్న పాత్రలో ఆమె తళుక్కుమని మెరిశారు. దీంతో నిహారిక తర్వాతి చిత్రం కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఆమె యాంకర్ రవితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకొచ్చారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. పెళ్లి తర్వాత నటిస్తారా అని నెటిజన్లు ప్రశ్నించగా ఆమె వెంటనే స్పందించారు. తానేమీ సమంత కాదని, పెళ్లి తర్వాత నటించే విషయమై ఇప్పటికిప్పుడు చెప్పలేనని తేల్చి చెప్పేశారామె. కానీ వీలైనంత వరకు తన దగ్గరికొచ్చే అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా నటించేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
గ్లామరస్ పాత్రల్లో కూడా నటించనున్నట్టు నిహారిక వెల్లడించారు. తన రాబోయే తమిళ ప్రాజెక్ట్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనున్నట్టు ఆమె చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ తర్వాత గోవాలో రొమాంటిక్ సన్నివేశాల్నిచిత్రీకరించనున్నట్టు నిహారిక వెల్లడించారు.