“తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా ఇవ్వరు. ఎంతసేపూ పొరుగు రాష్ట్రం నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి, వాళ్లకే అవకాశాలు ఇస్తుంటారు.” చాలామంది చేసే విమర్శలివి. మరీ ముఖ్యంగా అవకాశాలు అంతగా చేజిక్కించుకోలేకపోయిన ఇషా రెబ్బా, అంజలి లాంటి తెలుగు హీరోయిన్లు చాలామంది ఈ విమర్శలు చేస్తుంటారు.
ఇప్పుడీ లిస్ట్ లోకి ఐశ్వర్య రాజేశ్ కూడా చేరింది. తను తెలుగమ్మాయినని, తన తాత, తండ్రి, అత్త.. తెలుగులో నటించారని, తనకు మాత్రం టాలీవుడ్ లో పెద్ద సినిమా ఆఫర్లు రాలేదని వాపోయింది.
నిజానికి ఇలా 'తెలుగు సెంటిమెంట్ కార్డ్' వాడిన ప్రతిసారి హీరోయిన్లపై సింపతీ పెరిగేది. అయ్యో పాపం అనుకునే జనాలు ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఐశ్వర్య రాజేశ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది శ్రీలీల. నిద్రపోవడానికి కూడా టైమ్ లేనంత బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ ఓ తెలుగమ్మాయి. ఇక ఇప్పుడిప్పుడే అవకాశాల వేటలో అందరికంటే ముందుంది మరో హీరోయిన్ డింపుల్ హయతి. తెలుగమ్మాయినైనా తనకు మంచి అవకాశాలొస్తున్నాయని మొన్ననే ఆమె ప్రకటించింది.
ఈ నేపథ్యంలో.. ఐశ్వర్య రాజేష్ ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కార్డ్ పనిచేయలేదు. శ్రీలల, డింపుల్ ను చూపిస్తూ, ఐశ్వర్యపై ట్రోలింగ్ చేస్తున్నారు టాలీవుడ్ జనం.
నిజానికి ఇప్పుడు టాలీవుడ్ కు కావాల్సింది తెలుగమ్మాయో, బాలీవుడ్ హీరోయిన్నో కాదు. మనవన్నీ టిపికల్ కమర్షియల్ తెలుగు సినిమాలు. మరీ ముఖ్యంగా మన కథల్లో హీరోయిన్ కు గ్లామర్ ఉండాలి. నటన సంగతి తర్వాత. ఆ కోణంలో ఐశ్వర్య రాజేష్ కు తక్కువ మార్కులేస్తున్నారు నెటిజన్లు. అందుకే ఐశ్వర్యకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని, ఆ విషయాన్ని ఆమె ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని చెబుతున్నారు.