ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ షూటింగ్స్ మొదలుపెడుతున్నారు చాలామంది హీరోలు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం ఈ విషయంలో మరో అడుగు ముందుకేశాడు. ఏకంగా ఫారిన్ లొకేషన్ లో షూట్ స్టార్ట్ చేశాడు. అక్షయ్ కుమార్ హీరోగా బెల్ బాటమ్ అనే సినిమా షూటింగ్ లండన్ లో ప్రారంభమైంది.
కరోనా తర్వాత విదేశీ లొకేషన్లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా బెల్ బాటమ్ నిలిచింది. ఈ సినిమా కోసం ఇప్పటికే హీరోయిన్లు హుమా ఖురేషీ, లారా దత్తా లండన్ చేరుకోగా.. తాజాగా అక్షయ్ కుమార్ కూడా సెట్స్ పైకి వెళ్లాడు. అన్ని జాగ్రత్తల మధ్య తమ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టు అధికారికంగా ప్రకటించాడు ఈ హీరో.
“లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్ అండ్ యాక్షన్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బెల్ బాటమ్ షూటింగ్ చేస్తున్నాం. ఇది క్లిష్టమైన పరిస్థితి. కానీ పని జరగాల్సిందే. మీ అందరి ప్రేమ మాకు కావాలి” అంటూ క్లాప్ బోర్డ్ తో చిన్న వీడియో పోస్ట్ చేశాడు అక్కీ.
వాణీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 80ల్లో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి రంజిత్ తివారీ దర్శకుడు.