Advertisement

Advertisement


Home > Movies - Movie News

అక్షయ్: అప్పుడు గుడ్ బాయ్.. ఇప్పుడు బ్యాడ్ బాయ్

అక్షయ్: అప్పుడు గుడ్ బాయ్.. ఇప్పుడు బ్యాడ్ బాయ్

సినిమా నటుల్లో లాక్ డౌన్ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది అక్షయ్ కుమార్. కరోనా విలయతాండవం మొదలైన సమయంలో ఏకంగా 25కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. ఆ తర్వాత అక్షయ్ జీవితంపై ఎన్నో కథనాలు, ఆయన కెరీర్ పై మరెన్నో ప్రశంసలు. ఆ ఎపిసోడ్ పూర్తయింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ పై విమర్శల ఎపిసోడ్ మొదలైంది.

రెండు రోజులుగా మహారాష్ట్ర మీడియా అక్షయ్ ని బ్యాడ్ బాయ్ గా చిత్రీకరిస్తూ వార్తలు వడ్డిస్తోంది. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని విమర్శలు. ఇంతకీ అక్కీ ఏం చేశాడని ఆరాతీస్తే... ముంబై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నాసిక్ వెళ్లడం, అక్కడి ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఒక రోజు గడిపి తిరిగి హెలికాప్టర్ లో ముంబైకి రావడం.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అందులోనూ నాసిక్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశమంతా అన్ లాక్ జరుగుతున్నా.. నాసిక్ లో మాత్రం ఇంకా ఆంక్షలు కఠినంగానే ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి ముంబై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హీరో అక్షయ్ ఎందుకు వెళ్లారనేదే ఇప్పుడు ప్రశ్న.

వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక అనుమతులుంటేనే విమానాలు, హెలికాప్టర్లు ఎక్కగలుగుతున్నారు. అలాంటిది అక్షయ్ కి  అసలు ప్రభుత్వ అనుమతి ఉందా అని సోషల్ మీడియా ముక్తకంఠంతో ప్రశ్నించింది. దీంతో మహారాష్ట్ర మంత్రి సైతం దిగిరావాల్సిన పరిస్థితి. స్థానిక ప్రజా ప్రతినిధి, మంత్రి అయిన చగన్ భుజ్ భల్ ఈ విషయంలో పూర్తిస్థాయి ఎంక్వయిరీకి ఆదేశించామని చెప్పారు.

దీనిపై అక్షయ్ స్పందించలేదు కానీ, ఆయన పీఏ వివరణ ఇచ్చారు. వైద్య అవసరాల నిమిత్తం అక్షయ్ నాసిక్ వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే మీడియా మాత్రం అక్షయ్ ని ఓ విలన్ లా ప్రొజెక్ట్ చేస్తోంది. వ్యక్తిగత పని మీద నాసిక్ వెళ్లి అక్కడ రిసార్ట్ లో చాలామందిని కలిసి వచ్చారని, ఈ సీక్రెట్ మీటింగ్ గురించి ప్రజలకు అవసరం లేదు కానీ, కరోనా కాలంలో.. ప్రభుత్వ అనుమతి లేకుండా హెలికాప్టర్ లో వెళ్లి రావడం మాత్రం సరికాదని మీడియాలో కథనాలొస్తున్నాయి. 

జస్ట్ కొన్ని రోజుల కిందటి వరకు మీడియాకి హీరోలా కనిపించిన వ్యక్తి, ఇప్పుడు ఒక్కసారిగా విలన్ గా కనిపిస్తున్నాడు. ఇంతకీ దీనిపై అక్షయ్ కుమార్ ఏమని స్పందిస్తారో చూడాలి. 

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?