బాలీవుడ్ లో చారిత్రాత్మక సినిమాలకు కొదవలేదు. చరిత్రలోని ఎందరో మహనీయుల జీవిత కథల ఆధారంగా అక్కడ సినిమాలు వచ్చాయి. ఒక దశలో భగత్ సింగ్ మీద అయితే వరస పెట్టి సినిమాలు వచ్చాయి! సినిమా వాళ్లు ఏం చేసినా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావు. దీంతో కొన్ని సినిమాలు హిట్ అయితే, మరి కొన్ని సినిమాలు ఫట్ మన్నాయి.
ఎంత చరిత్రలోని యోధుల సినిమాలు, దేశభక్తుల జీవిత కథల ఆధారంగా వచ్చిన సినిమాలు అయినప్పటికీ.. కొన్ని సినిమాలు ఆకట్టుకోలేదు, డిజాస్టర్లుగా మిగిలాయనేది చేదు నిజం. ఈ క్రమంలో అక్కడ మరో యోధుడి సినిమా వస్తోంది. అదే పృథ్విరాజ్. అక్షయ్ కుమార్ టైటిల్ లో రూపొందిన ఈ సినిమా ప్రచారానికి పూనుకున్నాడు సదరు హీరో.
ఈ సందర్భంగా ఆయన చెప్పేదేంటంటే.. తన సినిమాను స్కూళ్లలో తప్పకుండా ప్రదర్శించాలనేది! తన సినిమా ద్వారా పిల్లలకు చరిత్ర గురించి జ్ఞానం వస్తుందని అక్షయ్ చెప్పుకుంటున్నాడు. పృథ్విరాజ్ ఎంత వీరుడో తెలుసుకోవడానికి తన సినిమాను చూడాలని ఈయన అంటున్నాడు.
పాఠశాలల్లో పిల్లలకు ఈ సినిమాను తప్పకుండా చూపాలని ప్రభుత్వానికి అక్షయ్ కుమార్ ఒక బహిరంగా విన్నపంలాంటిది కూడా చేశాడు! మరి కాషాయ వాదులు మరో సినిమాను మోయాల్సిన వచ్చినట్టుగా ఉంది.
భారతీయ పౌరుడు కాకపోయినప్పటికీ.. ఇప్పటికీ కెనడా పాస్ పోర్ట్ తో ఇండియాలో స్టార్ గా ఉన్నప్పటికీ అక్షయ్ కుమార్ ను దేశభక్త సినిమా హీరోగా భక్తులు ఎప్పుడో గుర్తించారు. ఈ క్రమంలో అతడి తాజా సినిమాను తప్పనిసరిగా అంతా చూడాలనే చేయడం పెద్ధ కథ కాదు.
అయినా.. సినిమా వాళ్లు చరిత్రలోని యోధుల గురించి చెప్పే తీరు ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలో కల్పిత కథలకు వాస్తవ యోధుల పేర్లను పెట్టి ఇష్టానుసారం వ్యవహరించారు. మరి అక్షయ్ కుమార్ సినిమా కూడా అలాంటి తానులో ముక్క కాదని ఎవ్వరూ చెప్పలేరు.
అయితే తన సినిమా చరిత్రకు దర్పణం పడుతుందని, అంతా చూడాల్సిందే అని అంటున్నాడు ఈ హీరో. అయినా అంత చరిత్రను పిల్లలకు తెలపాలనే ఉబలాటం ఉంటే ఉచిత ప్రదర్శనలు వేయొచ్చు కదా!