జీవితంలో ప్రేమ చాలా నేర్పుతుంది. ప్రేమ గుడ్డిదని ఎందుకంటారో తెలియదు కానీ, అది అన్ని సమయాల్లో నిజం కాదు. ప్రేమంటే ఓ మహా మేధావి. ప్రేమంటే ఓ మాయావి. ప్రేమ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, రాసుకోవచ్చు. ప్రేమపై వచ్చినంత కవిత్వం మరే అంశంపై కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రేమకున్న గొప్పదనం అదే. ప్రేమ మనిషిని మంచిగానూ, చెడుగానూ…ఎలాగైనా తీర్చిదిద్దుతుంది. అయితే ఆయా పరిస్థితులను బట్టి ప్రేమికులు వ్యవహరిస్తుంటారు.
బాలీవుడ్ స్టార్స్ రణభీర్ కపూర్, ఆలియా భట్ చేతిలో చేయి వేసుకుని చెట్టపట్టాలేసుకున్న తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఏమైందో కానీ, వాళ్లిద్దరి విభేదాలు వచ్చాయని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ గుసగుసల వెనుక కారణాలు లేకపోలేదు.
కొన్ని రోజుల క్రితం ఓ పార్టీలో కొందరు స్నేహితులతో కలిసి ఆలియా భట్ పార్టీలో పాల్గొంది. పార్టీ నిర్వాహకులు రణభీర్కు కూడా స్నేహితులే. పార్టీ సందడిసందడిగా సాగింది. దీంతో ఆ ఫొటోలను ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలియా ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే రణభీర్ …ఆ ఫొటోల్లో కనిపించకపోవడంతో నెటిజన్లకు ఏదో అనుమానం వచ్చింది.
ఇంకేం ఉంది… రణభీర్ కపూర్ , ఆలియాకి మధ్య విభేదాలున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అనవసర ప్రచారానికి అవకాశం ఇచ్చానని భావించిన ఆలియా…ఆ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆలియా తన తెలివితేటలను ఉపయోగించింది.
తన ఇన్స్టాలో ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇంట్లో సంధ్యా సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫొటో క్రెడిట్ నా అభిమాన ఫొటోగ్రాపర్ ఆర్.కె(రణభీర్ కపూర్)దే’ అని కామెంట్ పెట్టింది. ఆలియా ఎంత తెలివైందో ఇదొక్క ఉదాహరణ చాలు. ఈ ఫొటో క్రెడిట్ రణభీర్ అని చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య వార్తలకు ఫుల్స్టాప్ పెట్టినట్టైంది. ప్రేమ తెలివితేటలంటే ఇలాంటివే మరి!