కల్కి సినిమా ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించాలని యూనిట్ భావించింది. దీని కోసం బుజ్జిని మెయిన్ థీమ్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కల్కి సినిమా ప్రచారం మొత్తం బుజ్జి చుట్టూ తిరుగుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ వాడే కారు పేరు బుజ్జి. దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. ఈ కారు ఆవిష్కరణతోనే కల్కి ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కు చేరాయి. బుజ్జిని డ్రైవ్ చేస్తూ, ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక్కడితో బుజ్జి కాన్సెప్ట్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాగచైతన్య లాంటి కొంతమంది సెలబ్రిటీల్ని తీసుకొచ్చి బుజ్జిని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్లారు. ఇప్పుడు బుజ్జి బొమ్మల్ని కూడా తయారుచేసి పంపిణీ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లీంకారకు కల్కి కార్టూన్లతో పాటు, బుజ్జి బొమ్మను అందించారు.
కల్కి కోసం బాహుబలి సెంటిమెంట్
మరోవైపు కల్కి ట్రయిలర్ లాంచ్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయంలో బాహుబలి ఫార్ములాను ఫాలో అవ్వాలని భావిస్తున్నారు మేకర్స్. ఇన్నాళ్లూ లోకల్ గా చేసిన ప్రచారాన్ని, ట్రయిలర్ తో జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.
అందుకే ముంబయిలో ట్రయిలర్ లాంచ్ పెట్టుకున్నారు. బాహుబలి-2 ట్రయిలర్ ను ముంబయిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వీకెండ్ ముంబయిలో కల్కి ట్రయిలర్ ను లాంచ్ చేస్తారు. ప్రభాస్ తో పాటు.. అమితాబ్, దీపిక, దిశా పటానీ ఈ ట్రయిలర్ లాంచ్ కు హాజరుకాబోతున్నారు.
ఈనెల 27న థియేటర్లలోకి రాబోతోంది కల్కి సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మరిన్ని ప్రచార ఎత్తుగడల్ని అనుసరించబోతోంది యూనిట్. ఓవర్సీస్ లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.