అల్లరి నరేష్ తన కొత్త సినిమా ప్రకటించాడు. ఆ మూవీకి 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ పెట్టారు. ఈ పేరు చెప్పగానే రాజేంద్రప్రసాద్ నటించిన సూపర్ హిట్ మూవీ గుర్తొస్తుంది. అడుగడుగునా కామెడీ పండించిన సినిమా అది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ టైటిల్ ను రిపీట్ చేస్తున్నాడు అల్లరి నరేష్.
నిజానికి ఈ టైటిల్ వాడుకునే అన్ని అర్హతలు అల్లరి నరేష్ కు ఉన్నాయి. ఎందుకంటే, కామెడీతో ఇప్పటికే తన మార్క్ సెట్ చేశాడు ఈ హీరో. పైగా తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన సినిమా అది. అలా అల్లరినరేష్ చెంతకు చేరింది ఈ టైటిల్.
అలనాటి 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో రాజభోగం కోసం రాజేంద్రప్రసాద్ వెయిట్ చేస్తాడు. తాజా సినిమాలో పెళ్లి కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. పెళ్లి ఎప్పుడని ఎన్ని భాషల్లో అడిగినా 'ఆ ఒక్కటి అడక్కు' అంటాడు అల్లరోడు.
పెళ్లి కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. ఈ సినిమా ఏ మేరకు కొత్తదనం-కామెడీ అందిస్తుందో చూడాలి. మల్లి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్. అబ్బూరి రవి రచన, గోపీసుందర్ సంగీత దర్శకుడు.