పెరిగిన పారితోషికాలు.. అల్లు అరవింద్ లాజిక్ ఇది!

కరోనా తర్వాత హీరోల పారితోషికాలు తగ్గుతాయని అంతా ఊహించారు. కానీ దానికి పూర్తి రివర్స్ లో కరోనా తర్వాత హీరోల రెమ్యూనరేషన్లు పెరిగాయి. స్టార్ హీరోలు మాత్రమే కాదు, నాని లాంటి మిడ్ రేంజ్…

కరోనా తర్వాత హీరోల పారితోషికాలు తగ్గుతాయని అంతా ఊహించారు. కానీ దానికి పూర్తి రివర్స్ లో కరోనా తర్వాత హీరోల రెమ్యూనరేషన్లు పెరిగాయి. స్టార్ హీరోలు మాత్రమే కాదు, నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా రేట్లు పెంచేశారు.

దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయిందనే వాదన ఉంది. హీరోలు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే, ప్రొడక్షన్ కాస్ట్ ఆటోమేటిగ్గా తగ్గుతుందని బాహాటంగా చెప్పే నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఈ అంశంపై అల్లు అరవింద్ వాదన మాత్రం మరోలా ఉంది.

“పెరిగిన సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యూనరేషన్ 20-25 శాతం మాత్రమే. హీరోల వల్ల కాస్ట్ పెరగడం లేదు, కాస్ట్ పెరిగిన సినిమాల్లో హీరోలుంటున్నారు. నేను సినిమాల పేర్లు చెప్పను, కొన్ని సినిమాల్ని మీరు గమనిస్తే సినిమాల కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్ ఎంతనేది మీ జర్నలిస్టులే లెక్కలేసుకోండి. పారితోషికాలు తక్కువే ఉన్నాయి. కాబట్టి హీరోల వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోయి నాలాంటి నిర్మాతలు దూరంగా ఉండడం లేదు.”

ఇలా హీరోల పెరిగిన రెమ్యూనరేషన్లను వెనకేసుకొచ్చారు అల్లు అరవింద్. తన ఇంట్లో కూడా ఓ స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి, అల్లు అరవింద్ ఇలా స్పందించడంలో తప్పులేదు. మరి ఈమధ్య ఈ మెగా ప్రొడ్యూసర్ పెద్ద సినిమాలు ఎందుకు తీయడం లేదు?
 
దీనికి కూడా అల్లు అరవింద్ దగ్గర సమాధానం ఉంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై 2 పెద్ద సినిమాలున్నాయని, కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయని అన్నారు. పెద్ద హీరోల సినిమాల్ని పెద్దగా చూపించకపోతే ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ క్రమంలో బడ్జెట్ పెరిగింది తప్ప, హీరోల పారితోషికాల వల్ల పెరగలేదని అరవింద్ లాజిక్.