అల్లువారి కుటుంబంలో అల్లు అర్జున్ స్టార్ హీరో. అదే కుటుంబం నుంచి అల్లు బాబి నిర్మాతగా మారాడు. కాబట్టి సహజంగానే వాళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. ఇదే ప్రశ్న కొత్త నిర్మాత అల్లు బాబికి ఎదురైంది. దీనిపై సూటిగా సుత్తిలేకుండా స్పందించాడు బాబి.
బన్నీతో సినిమా చేయడం అంత ఈజీ కాదంటున్నాడు బాబి. సొంత తమ్ముడే అయినప్పటికీ, అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే చాలా డబ్బు కావాలంటూ సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం తన కంపెనీని తానే రన్ చేస్తున్నానని, బాగా నిలదొక్కుకున్నప్పుడు, ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా బన్నీతో సినిమా చేస్తానని ప్రకటించాడు.
అయితే కంటెంట్ లేకపోతే కలవడం కష్టమనే విషయాన్ని కూడా బాబి స్పష్టంచేశాడు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే కంటెంట్ చాలా ముఖ్యమని, మంచి కథ ఎవరైనా తీసుకొస్తే.. బన్నీతో సినిమా ప్రొడ్యూస్ చేయలేకపోయినా కనీసం ప్రజెంట్ చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.
గని సినిమాతో అధికారికంగా నిర్మాతగా మారాడు బాబి. ఈ సినిమా కోసం అతడు ప్రొడక్షన్ కంపెనీ స్థాపించాడు. అయితే తన మాతృసంస్థ గీతాఆర్ట్స్ తరహాలో రెగ్యులర్ గా సినిమాలు చేయనంటున్నాడు బాబి. కథ తనను కదిలించినప్పుడు మాత్రమే సెట్స్ పైకి వెళ్తానంటున్నాడు.