కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జీవితం అన్న తర్వాత కష్టనష్టాలొస్తాయని, వాటి గురించి బాధపడుతూ కూచోవద్దని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన అనుభవాలను ఆమె వెల్లడించారు.
మాతృభాష మలయాళ చిత్ర పరిశ్రమకు తానెందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో, తానెందుకో హర్ట్ అయిందో ఆమె చెప్పుకొచ్చారు. తొలి సినిమా ప్రేమమ్ విడుదల తర్వాత కొందరు తనపై కావాలనే దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారామె. అహంకారిననే ముద్ర వేశారని మండిపడ్డారు.
అయితే మనసుకు కష్టం కలిగినప్పుడు దాని గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆమె పేర్కొన్నారు. జీవితంలో చీకట్లే కాదు…వెలుగులకు స్థానం ఉంటుందన్నారు. ఆ నమ్మకమే తనను ముందుకు నడిపించినట్టు అనుపమ తెలిపారు. తన మాటల్ని వక్రీకరిస్తూ, తన గురించి తప్పుడు ప్రచారం చేశారన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై చేసిన విమర్శలు హర్ట్ చేశాయన్నారు.
అందువల్లే మలయాళంలో మళ్లీ సినిమాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు అనుపమ తెలిపారు. ‘ప్రేమమ్' తర్వాత మాతృభాషలో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలొచ్చినా తిరస్కరించినట్టు తెలిపారు. తెలుగు, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అనుపమా పరమేశ్వరన్ తెలిపారు. చిన్న వయసులోనే మోసమేమిటో చూసినట్టు తెలిపారు. నాపై ప్రచారం జరుగుతున్నట్టుగా అహంకారిని కాదని ఆమె తేల్చి చెప్పారు.