రీసెంట్ గా అమలాపాల్ తన మనసులో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కెరీర్ పైనే దృష్టిపెట్టానని తెలిపిన అమలాపాల్, కొద్దికాలంగా మాత్రం ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. ఇప్పుడా వ్యక్తికి సంబంధించి మరిన్ని వివరాల్ని “గ్రేట్ ఆంధ్ర”తో పంచుకుంది.
“మనం ఎంత కష్టపడినా మన కోసం ఒకరున్నారనే భావన కలగాలి. అలాంటి ఫీలింగ్ ను నా బాయ్ ఫ్రెండ్ నాకు కలిగించాడు. నాకోసం అతడు తన ఉద్యోగం కూడా మానేశాడు. ఓ చిన్న పార్ట్ టైమ్ జాబ్ చూసుకున్నాడు. నాతోనే ఉంటాడు. నన్ను బాగా చూసుకుంటాడు.”
ఆమె సినిమాలో నగ్నంగా కనిపించాల్సి వచ్చినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ వ్యతిరేకించలేదంటోంది అమలాపాల్. పైగా తనలో ధైర్యాన్ని నింపాడని, మెచ్చుకున్నాడని చెప్పుకొచ్చింది. “ఆమె సినిమాలో నగ్నంగా నటించాల్సి వచ్చినప్పుడు నేను ఆలోచించిన విషయం ఒకేఒక్కటి. నగ్నంగా కనిపించడం కోసం నా శరీరాన్ని మరింత నాజుగ్గా తయారుచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేయాలా వద్దా అనే ఆలోచన రాలేదు. బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే ఆలోచనే వచ్చింది. ఈ విషయంలో నా బాయ్ ఫ్రెండ్ నాకు పూర్తిమద్దతు ఇచ్చాడు. బాగా చేయమని సపోర్ట్ చేశాడు.”
దర్శకుడు ఏఎల్ విజయ్ తో బ్రేకప్ పై పరోక్షంగా స్పందించింది అమలాపాల్. చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులు తనను స్వతంత్రంగా పెంచారని, అలా పెరగడం వల్లనే ఇండస్ట్రీలో నిలబడగలిగానని, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడగలిగానని అంటోంది. అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది.