సైరా ప్రమోషన్ లో భాగంగా తొలిసారి మీడియా ముందుకొచ్చారు అమితాబ్ బచ్చన్. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాల్ని షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయాలపై బిగ్ బి సూటిగా స్పందించారు. పాలిటిక్స్ లోకి వెళ్లొద్దని చెప్పినా ఇద్దరూ వెళ్లారని అన్నారు.
“నేను ఎప్పటికప్పుడు చిరంజీవికి సలహాలు ఇస్తుంటాను. కానీ ఆయన నా మాట వినలేదు. ఓసారి చిరంజీవి నా దగ్గరకొచ్చి.. సర్ రాజకీయాల్లోకి వెళ్దామనుకుంటున్నానని చెప్పారు. అయ్యో.. ఆ తప్పు మాత్రం చేయొద్దని చెప్పాను. కానీ నా మాట వినలేదు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కలిశారు. సర్ నేను రాజకీయాల నుంచి బయటకొచ్చేశానని చెప్పారు. వాళ్ల తమ్ముడు కూడా రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయనకు కూడా రాజకీయాలొద్దనే చెప్పాను. అదేంటో.. ఆయన (పవన్) కూడా నా మాట వినలేదు.”
నటుడు-నిర్మాత-దర్శకుడు ఫర్హాన్ అక్తర్ సైరా సినిమాను నార్త్ లో రిలీజ్ చేస్తున్నాడు. అతడే బిగ్ బి, చిరంజీవిని కూర్చోబెట్టి ఈ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవిని తొలిసారి కలిసిన సంఘటనను పంచుకున్నారు అమితాబ్. ఊటీలో ఫస్ట్ టైమ్ చిరంజీవిని చూశానని, అదే రోజు వెళ్లి కలిశానని అన్నారు.
“ఓసారి ఊటీలో నేను హమ్ అనే సినిమా షూటింగ్ చేస్తున్నాను. అదే టైమ్ లో చిరంజీవి అక్కడో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇద్దరి లొకేషన్లు చాలా దగ్గరగా ఉన్నాయి. చిరంజీవిని చూసిన వెంటనే నేనే వెళ్లి కలిశాను. చాలా కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఇంతలోనే ఎవరో వచ్చి షాట్ రెడీ అన్నారు. మీరు నమ్మరు.. చాలా కష్టమైన డాన్స్ మూమెంట్ ను కొన్ని సెకెండ్లలో, సింగిల్ టేక్ లో చిరంజీవి అలా వేశారు. నాకైతే ఆ స్టెప్ వేయడానికి కనీసం రెండేళ్లు పడుతుందనుకుంటున్నాను. చిరంజీవి ఆ డాన్స్ మూమెంట్ ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థంకాదు. నేను ఆశ్చర్యపోయాను. ఇలా ఎలా డాన్స్ చేస్తున్నారంటూ చాలా ఆశ్చర్యపోతూ అడిగాను. అదే మా తొలి పరిచయం. ఆ రోజు చాలాసేపు మేం మాట్లాడుకున్నాం.”
ఈ సందర్భంగా చిరంజీవి కూడా బిగ్ బితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తను తొలిసారి బాలీవుడ్ లో హీరోగా సినిమా చేసినప్పుడు, అమితాబ్ ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతను గుర్తుచేసుకున్నారు. సైరాలో నటించినందుకు మరోసారి అమితాబ్ కు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.