అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా. నిజానికి ఇది ఇప్పటి సినిమా కాదు. మూడేళ్ల కిందటి మూవీ. 2022 జనవరిలో ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా నుంచి ఇంకో టీజర్ విడుదల చేశారు. దీనికి ప్రీ-వెడ్డింగ్ టీజర్ అని పేరు పెట్టారు.
ఈసారి ఓ కొత్త దర్శకుడ్ని, కొత్త హీరోయిన్ ను పరిచయం చేయడానికి ఈ వీడియోను వాడుకున్నారు. ఎప్పట్లానే వీడియోలో నవీన్ పొలిశెట్టి తన మార్క్ కామెడీ చూపించాడు. ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వీడియోను బేస్ చేసుకొని కొంత కామెడీ చేశాడు. చివర్లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని పరిచయం చేశాడు.
ఈ సినిమా కోసం ముందుగా కల్యాణ్ శంకర్ ను దర్శకుడిగా అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలోకి కొత్త దర్శకుడు మారి వచ్చి చేరాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
నవీన్ పొలిశెట్టి యాక్సిడెంట్ కు గురవ్వడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఇప్పుడతను కోలుకున్నాడు. ఈ టీజర్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. యాక్సిడెంట్ కు గురై బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కొన్ని కథలకు మార్పుచేర్పులు చేశానని స్వయంగా ప్రకటించాడు నవీన్.
అలా మార్చుచేర్పులతో, కొత్త దర్శకుడితో వస్తోంది అనగనగా ఒక రాజు సినిమా. 2025లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి చేస్తున్న మూవీ ఇదే.