బిగ్‌బాస్ షోకు వెళ్లి వచ్చిన వారెవరికైనా ప్రత్యేక గుర్తింపు రావడం చూశాం. అయితే యాంకర్ రవి విషయంలో అంతా రివర్స్. యాంకర్ రవికి బిగ్‌బాస్ రియాల్టీ షోకు వెళ్లక ముందు నుంచే మంచి పాపులారిటీ ఉంది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఆయనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ భావించారు.
రియాల్టీ షోకు వెళ్లి వచ్చిన తర్వాత రవి ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశించిన ఆయన అభిమానులకి తాజా పరిణామాలు చేదు మిగిల్చాయి. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై సాగుతున్న ట్రోలింగ్ దాడిపై రవి ఆవేదన చూస్తే… అయ్యో పాపం అనే సానుభూతి కలగకుండా ఉండదు.
సోషల్ మీడియాలో రవిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇది రోజురోజుకూ పెరుగుతుండడాన్ని రవి జీర్ణించుకోలేకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై ట్రోల్ జరిగింది. హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత రవికి ఈ విషయాలన్నీ తెలిసొచ్చాయి. అంతేకాదు, షో నుంచి బయటికొచ్చిన రవిపై కూడా ట్రోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది.
ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే తలంపుతో సైబర్ క్రైమ్ పోలీసులకు రవి ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్న నెటిజన్లపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో రవి ఇంటికి వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలు, స్క్రీన్ షాట్స్ రవి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని రవి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు.
“మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్దాం. సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదాం” అనే హ్యాష్ ట్యాగులతో ఈ వీడియోని రవి పోస్ట్ చేశారు. ఇప్పటికైనా రవి, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ ఆగాలని ఆశిద్దాం.