సుమ.. స్నాక్స్.. మీడియా.. ఇప్పుడిదే ట్రెండింగ్

సీనియర్ యాంకర్ సుమ హాస్యచతురత గురించి అందరికీ తెలిసిందే. ఎదుటివారిని నొప్పించకుండా సున్నితంగా పంచ్ లు వేయడంలో ఆమె పండిపోయారు. ఆమె స్పాంటేనిటీ ముందు మరే యాంకర్ పనికిరాదు. అలా వివాదాలకు దూరంగా కెరీర్…

సీనియర్ యాంకర్ సుమ హాస్యచతురత గురించి అందరికీ తెలిసిందే. ఎదుటివారిని నొప్పించకుండా సున్నితంగా పంచ్ లు వేయడంలో ఆమె పండిపోయారు. ఆమె స్పాంటేనిటీ ముందు మరే యాంకర్ పనికిరాదు. అలా వివాదాలకు దూరంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ యాంకర్.. ఇప్పుడు సడెన్ గా వివాదాస్పదమయ్యారు. సుమపై ప్రస్తుతం మీడియా గుర్రుమంటోంది.

ఎప్పట్లానే ఈరోజు కూడా ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు సుమ. కార్యక్రమం ప్రారంభంకావడానికి కాస్త టైమ్ ఉంది. వేదిక బయట మీడియా సభ్యులు స్నాక్స్ తింటున్నారు. వాళ్లను లోపలికి పిలిచే క్రమంలో సుమ నోరుజారారు. స్నాక్స్ ను భోజనంలా తింటున్న మీడియా ప్రతినిధులు తొందరగా లోపలకు రావాలంటూ చురకలంటించారు.

మీడియా ప్రతినిధులతో సహజంగా ఉండే అనుబంధంతో, చనువుకొద్దీ సరదాగా ఆ మాటలన్నానని సుమ అనుకున్నారు. అయితే సుమ చురకలంటిస్తే, కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రం అది అగ్గిలా మండింది. ఓ జర్నలిస్ట్ ఇదే విషయంపై సుమను హెచ్చరించాడు కూడా.

మీ యాంకరింగ్ అంటే అందరికీ ఇష్టమేనని, కానీ మీడియా గురించి అలా మాట్లాడ్డం సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. తప్పు తెలుసుకున్న సుమ, అదే వేదికపై క్షమాపణలు చెప్పారు.

ఇక్కడితో మేటర్ అయిపోలేదు. మీడియాపై సుమ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వాదోపవాదాలు మొదలయ్యాయి. ఎక్కువమంది సుమను వెనకేసుకురావడం విశేషం. సుమ కూడా అక్కడితో ఆగలేదు.

మరోసారి మీడియాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. “ఈరోజు ఓ ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు మీడియాను ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమౌతోంది. నిండు మనసుతో నన్ను క్షమించండి” అంటూ వీడియో విడుదల చేశారు. సుమ కొడుకు హీరోగా పరిచయమౌతున్న సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.