గాంజా శంకర్.. సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సినిమా ప్రకటించి చాన్నాళ్లయింది. అదే టైమ్ లో 'ఫస్ట్ హై' అంటూ వీడియో కూడా విడుదల చేశారు. ఇన్నాళ్లకు ఈ సినిమాపై తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో దృష్టి పెట్టింది. గాంజా శంకర్ టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజాగా హీరో సాయితేజ్, నిర్మాత నాగవంశీ, దర్శకుడు సంపత్ నందితో పాటు పలువురికి నోటీసులు జారీచేసింది యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో. సినిమా టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, టైటిల్ మార్చాలని తమ నోటీసులో సూచించింది.
రిలీజ్ చేసిన వీడియోపై కూడా స్పందించిన బ్యూరో, యువతను పెడదారి పట్టించేలా సన్నివేశాలున్నాయని, కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పింది. ఈ సందర్భంగా సెక్షన్ 8, సెక్షన్ 29లోని మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించిన కొన్ని క్లాజులు, వాటి శిక్షల్ని నోటీసులో ప్రస్తావించారు.
డ్రగ్స్ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. మాదకద్రవ్యాల ప్రస్తావన ఏ రూపంలో ఉన్నా దాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈమధ్యే ప్రకటించారు. అంతలోనే గాంజా శంకర్ సినిమాకు ఇలా నోటీసులు అందడం గమనార్హం.
నిజానికి సెన్సార్ బోర్డుకు వెళ్లేంతవరకు ఇలాంటి అభ్యంతరాలేవీ తెరపైకి రావు. టైటిల్ నుంచి కంటెంట్ వరకు ఇలాంటివన్నీ సెన్సార్ చూసుకుంటుంది. కానీ తొలిసారి యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో ఇలా కాస్త ముందుగా స్పందించింది. సినిమా సెట్స్ పై ఉంటుండగానే నోటీసులు అందించింది.