జనసేనాని, అగ్రహీరో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. నిబంధనల అమలు పేరుతో ఏపీ ప్రభుత్వం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాల్ని సినిమా థియేటర్ల వద్ద కాపలా పెట్టడం, సోదాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధికార పార్టీ ఒకవైపు, మిగిలిన రాజకీయ, సినీ పక్షాలన్నీ ఒకవైపు ఉంటూ పరస్పరం విమర్శల తూటాలు పేల్చుకుంటుండం సరికొత్త పరిణామం.
ఈ నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు విడుదల చేసిన ఓ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. నాగబాబు విడుదల చేసిన ఈ వీడియో ….ఒక రకంగా తమ కుటుంబంపై విసిరిన విమర్శల బాణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ లక్ష్యంగా చేసుకుని భీమ్లానాయక్ విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని నాగబాబు మండిపడ్డారు. ముఖ్యంగా నాగబాబు అన్న మాటల్లో విమర్శలకు దారి తీసినవి ఏంటంటే…
“పవన్‌కల్యాణ్ పైన, ఆయన సినిమాపైన పగబట్టి ఇంత అన్యాయం చేస్తుంటే పరిశ్రమ నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దవాళ్లెవరూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం. సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. ఓ హీరోకి జరుగుతున్న ఈ అన్యాయం తప్పు అని మాట్లాడకపోవడం దురదృష్టకరం” అని ఆయన వాపోయారు.
ఇటీవల చిత్ర పరిశ్రమ సమస్యలపై మెగాబ్రదర్ చిరంజీవి చొరవ తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పలు దఫాలు చర్చలు జరిపారు. ఈ మేరకు చర్చలు సత్ఫలితాలు ఇచ్చినట్టు స్వయంగా చిరంజీవే ఇటీవల సీఎంను కలిసిన అనంతరం ఆనందంతో చెప్పారు. పవన్‌కల్యాణ్‌కు జరుగుతున్న అన్యాయంపై మెగాస్టార్ చిరంజీవే మొదట స్పందించాలని నెటిజన్లు నాగబాబుకు హితవు చెబుతున్నారు.
అలాగే మెగాకుటుంబంలోనే సగం మంది హీరోలు, నిర్మాతలు, ఇతరత్రా విభాగాలకు చెందిన వారున్నారని, వాళ్లెందుకు స్పందించలేదో నాగబాబే చెప్పాలని నెటిజన్లు తమదైన శైలిలో ప్రశ్నించడం గమనార్హం. ఎవరో ప్రశ్నించాలని ఎదురు చూడడం, కోరుకోవడం కంటే ఆ పని తన ఇంటి నుంచే ప్రారంభిస్తే బాగుండేదని నాగబాబుకు హితవు చెబుతున్నారు.
నాగబాబు తాజా ప్రశ్నలు, నిలదీతలు, ఆవేదన అంతా… తన అన్న చిరంజీవిపై అని అర్థం చేసుకోవాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.