అరెస్ట్ తరువాత వెనక్కి తగ్గిన బోయపాటి?

దర్శకుడు బోయపాటి మహా మొండి ఘటం. నిర్మాతల మాట అంత సులువుగా వినే రకం కాదు. అది కథ అయినా, సీన్లు అయినా, విడుదల డేట్ అయినా. స్కంద‌ సినిమాలో పొలిటికల్ డైలాగుల విషయంలో…

దర్శకుడు బోయపాటి మహా మొండి ఘటం. నిర్మాతల మాట అంత సులువుగా వినే రకం కాదు. అది కథ అయినా, సీన్లు అయినా, విడుదల డేట్ అయినా. స్కంద‌ సినిమాలో పొలిటికల్ డైలాగుల విషయంలో తెరవెనుక చాలా జరిగింది అని తెలుస్తోంది. 

సినిమాలో అక్కడక్కడ పొలిటికల్ డైలాగులు మెరుపుల్లా మెరిసిన సంగతి తెలిసిందే. కానీ ఇవి నాట్.. నాట్.. వన్ పర్సంట్ కూడా కాదని తెలుస్తోంది. అసలు సిసలు డైలాగులు చాలా వుండేవని తెలుస్తోంది. సినిమా స్క్రిప్ట్ గట్టిగానే రాసుకున్నారు. దానికి తగినట్లే రత్నం డైలాగులు కూడా రాసారని తెలుస్తోంది.

నిజానికి సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనుకు, భాగస్వామి పవన్ కు పెద్దగా రాజకీయ బంధాలు లేవు. పైగా ఏ పార్టీకి సింపతైజర్లు కూడా కాదు. కానీ బోయపాటి హార్డ్ కోర్ టీడీపీ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఎన్నికల వేళ మాంచి మసాలా డైలాగులు సినిమాలో వేసినట్లు తెలుస్తోంది. కానీ తీరా చేసి, చంద్రబాబు అరెస్ట్ కావడం, ఆంధ్రలో రాజకీయాలు వేడెక్కడం చకచకా జరిగిపోయాయి. ఇది ఎటు వెళ్లి ఎటు వస్తుందో అర్థం కాని పరిస్థితి.

ఇలాంటి టైమ్ లో పొలిటికల్ డైలాగులతో సినిమా విడుదల చేస్తే ఎలా వుంటుందో అన్న అనుమానం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు పట్టుపట్టి, బోయపాటిని కిందా మీదా పెట్టి ఒప్పించి, కొన్ని డైలాగులు మార్చి రీ డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది.

ఇంత చేసినా, సినిమాలో పెద్దగా యాంటీ వైకాపా వ్యవహారం ఏమీ లేకున్నా, తెలుగుదేశం జనాలు ఇదేదో యాంటీ జగన్ సినిమా అన్నట్లు ప్రచారం సాగించడం మొదలుపెట్టారు. బూం..బూం అనే ఒక్క డైలాగ్ కట్ చేసే ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రచారం అటు ఏ పార్టీకి నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా, సినిమాకు మాత్రం పనికిరాదు. నిజానికి నిర్మాతలు కాస్త ముందు జాగ్రత్త పడడం మంచిదే అయింది. లేదంటే ఎలా వుండేదో?