నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. రేపు వీళ్ల వివాహం జరగనున్న నేపథ్యంలో, ఇవాళ్టి నుంచే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మిగతా పెళ్లిళ్లకు భిన్నంగా వీళ్ల పెళ్లి వేడుక కాక్ టెయిల్ పార్టీతో షురూ అయింది.
తమ క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులకు రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఇచ్చారు అతియా-రాహుల్. రాత్రంతా ఆ పార్టీ జరగ్గా, ఈరోజు మధ్యాహ్నం హల్డీ ఫంక్షన్ జరిగింది. మెహందీ ఫంక్షన్ కూడా మొదలైంది. సాయంత్రం సంగీత్ ఉంటుంది. రేపు అతియా శెట్టిని గ్రాండ్ గా పెళ్లాడబోతున్నాడు క్రికెటర్ కేఎల్ రాహుల్.
అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి ఖండాలాలో పెద్ద ఫామ్ హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్ లోనే పెళ్లి వేడుక జరుగుతోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. అతిథులందరికీ దక్షిణ భారత సంప్రదాయంలో, అరటి ఆకుల్లో భోజనాలు వడ్డిస్తున్నారు.
పెళ్లి తర్వాత తనే నూతన వధూవరుల్ని మీడియా ముందుకు తీసుకొస్తానని సునీల్ శెట్టి ప్రకటించాడు. అందరి ఆశీస్సులు వాళ్లకు కావాలన్నాడు. ఇక పెళ్లి తర్వాత ముంబయిలో భారీ రిసెప్షన్ ఏర్పాటుచేశాడు సునీల్ శెట్టి. దాదాపు 3వేల మంది ప్రముఖులను ఈ రిసెప్షన్ కు ఆహ్వానించాడు.
బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లతో పాటు.. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు ముంబయిలో జరగనున్న ఈ రిసెప్షన్ కు హాజరుకాబోతున్నారు.