టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. టాలీ వుడ్‌లో ఇది చర్చకు దారి తీసింది. చిత్ర పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ఆయనే పరిష్కరించే వారు. అలాంటి పెద్ద మనిషి కుమారుడిపై బంజారాహీల్స్ పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం.
బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్‌సోర్సింగ్ పనులు చేశాడు. 2018 నవంబర్ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసుకుని దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు సంబంధించి నర్సింహులకు డబ్బు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఒప్పందం పత్రంపై తాను సంతకం చేయలేదని అరుణ్ వాదిస్తున్నాడు. ఈ నెల 13న రాత్రి 9 గంటలకు తన డబ్బుల గురించి అరుణ్‌ను నర్సింహులు అడిగాడు. అనంతరం అతను చెప్పిన స్థలం వద్దకు నర్సింహులు వెళ్లాడు. అక్కడ తనను అరుణ్ కుమార్ కులం పేరుతో దూషించాడని, నీ అంతు చూస్తానంటూ బెదిరించాడని నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాసరి రెండో కుమారుడి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఈ నెల 16న బాధితుడు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారించి తాజాగా అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.