4 వారాలు.. 25 సినిమాలు.. ఒకే ఒక్క విజేత

ఆగస్ట్ లో 25 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒక్కటి మినహా, మిగతావన్నీ చేదు ఫలితాల్ని అందించాయి. భారీ అంచనాలతో వచ్చిన భోళాశంకర్, ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన గాండీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్ అవ్వడం…

ఆగస్ట్ లో 25 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒక్కటి మినహా, మిగతావన్నీ చేదు ఫలితాల్ని అందించాయి. భారీ అంచనాలతో వచ్చిన భోళాశంకర్, ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన గాండీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్ అవ్వడం ఆగస్ట్ బాక్సాఫీస్ లో షాకింగ్ అంశాలు.

మొదటి వారంలో.. ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వారం భోళాశంకర్ వస్తుందనే కారణంతో, ఈ వారం చిన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఏ సినిమాకు ప్రచారం లేదు, ఏ సినిమాకూ హైప్ రాలేదు. క్రికెటర్ ధోనీ నిర్మాతగా మారి తీసిన ఎల్.జి.ఎమ్ అనే డబ్బింగ్ మూవీ ఓ మోస్తరు అంచనాలతో వచ్చినప్పటికీ అది కాస్తా డిజాస్టర్ అయింది.

ఈ సినిమాలతో పాటు.. మిస్టేక్, రాజుగారి కోడి పులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, దిల్ సే, హెబ్బులి, బ్లడ్ అండ్ చాక్లెట్, ప్రియమైన ప్రియ సినిమాలు ఈ వారంలో రిలీజయ్యాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ ను రీ-రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఓ రోజంతా హంగామా నడిచింది.

రెండో వారంలో.. భారీ అంచనాలతో రిలీజైంది భోళాశంకర్ సినిమా. చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిస్థాయిలో డిసప్పాయింట్ చేసింది. సినిమా ప్రారంభం నుంచి క్లయిమాక్స్ వరకు ఏ దశలోనూ ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆది నుంచి  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అనుమానాలున్నాయి, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ అనుమానాలే నిజమయ్యాయి. ఈ సినిమా కేవలం డిజాస్టర్ అవ్వడమే కాకుండా, అందులోని కొన్ని సన్నివేశాలు, చిరు ఇమేజ్ ను సైతం దెబ్బతీశాయి.

భోళాశంకర్ కు ఒక రోజు ముందు రిలీజైంది జైలర్ మూవీ. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా, చాప కింద నీరులా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆగస్ట్ నెలలో సాలిడ్ హిట్ ఏదైనా ఉందంటే అది జైలర్ సినిమా మాత్రమే. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమాదే హవా.

మూడో వారంలో.. – భూతాల బంగ్లా, ప్రేమ్ కుమార్, జిలేబి, మదిలో మది, పిజ్జా-3 లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, దర్శకుడు విజయ్ భాస్కర్ తనయుడు శ్రీకమల్ నటించిన జిలేబి సినిమాలు కూసింత ఎట్రాక్ట్ చేశాయి. అయితే ఈ రెండూ బాక్సాఫీస్ బరిలో ఫెయిలయ్యాయి. వీటితో పాటు వచ్చిన మిగతా సినిమాలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి.

ఇక ప్రభాస్ పాత సినిమా యోగిని ఈ వారంలో రీ-రిలీజ్ చేశారు. అప్పట్లోనే ఫ్లాప్ అయిన ఈ సినిమా, రీ-రిలీజ్ లో మాత్రం మొదటి రోజు ఫ్యాన్స్ ను ఆకర్షించింది. అంతకుమించి ఈ సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.

ఆగస్ట్ చివరి వారంలో కింగ్ ఆఫ్ కొత్త, దక్ష, రెంట్, గాండీవధారి అర్జున, బెదురులంక, బాయ్స్ హాస్టల్, ఏం చేస్తున్నావ్, నేనేనా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో షాక్ ఇచ్చిన సినిమా గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' కూడా టాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చలేదు. మాస్ ఇమేజ్ కోసం దుల్కర్ చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.

అలా ఆగస్ట్ నెలలో అటుఇటుగా పాతిక సినిమాలు రిలీజ్ అవ్వగా.. వీటిలో డబ్బింగ్ మూవీ జైలర్ మాత్రమే ఆకట్టుకుంది. స్ట్రయిట్ మూవీస్ గా వచ్చిన భోళాశంకర్, గాండీవధారి అర్జున సినిమాలు షాక్ ఇచ్చాయి.