అదేం శాపమో, పాపమో కానీ హీరో అఖిల్ కెరీర్ సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. బ్యాచులర్ సినిమాతో ఓకె అనిపించుకున్నాడు, ఆపై భారీగా ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అనుకుంటే అది కాస్తా ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు నడుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కాస్త అయోమయంలో చిక్కుకుందని టాక్ వినిపిస్తోంది.
యాభై కోట్ల బడ్జెట్ అంచనాతో ప్రారంభమైందీ ప్రాజెక్ట్. అఖిల్ మీద అంత బడ్జెట్ పెట్టలేరు కనుక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా భాగస్వామి అని ప్లాన్ చేసారు. ఆయన బ్యానర్ కూడా యాడ్ చేస్తారు అని వార్తలు వినవచ్చాయి. కానీ లేటెస్ట్ గా సురేందర్ ఆ ఆలోచన విరమించుకున్నారని, తనకు రెమ్యూనిరేషన్ నే ఇవ్వమని అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే సినిమా బడ్జెట్ 70 కోట్లకు పెరిగిపోయిందని కూడా తెలుస్తోంది. కొంత పార్ట్ లు రీషూట్ చేయడం, కోవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందులు ఇవన్నీ కలిసి బడ్జెట్ ను పెంచేసినట్లు తెలుస్తోంది.
వీటన్నింటికి మించి ప్రొడక్షన్ టీమ్ కు, దర్శకుడు సురేందర్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ గట్టిగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఏజెంట్ సినిమా మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఎప్పటికి రెడీ అవుతుందో? ఎప్పటికి విడుదల అవుతుందో? అఖిల్ చేతిలో వున్న సినిమా ఇదొక్కటే ప్రస్తుతానికి.