బాలకృష్ణ చేసిన అత్యంత వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటి ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలుగులో వచ్చిన విభిన్నమైన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. కమర్షియల్ గా, మ్యూజికల్ గా కూడా ఆ సినిమా ఆకట్టుకుంది.
ఆ సినిమాకు సీక్వెల్ అనే ప్రతిపాదన చాన్నాళ్ల నుంచి వార్తల్లో ఉన్నదే. తెలుగులో సీక్వెల్స్ కు క్రేజ్ మొదలయ్యాకా.. ఆదిత్యకు కూడా సీక్వెల్ అంశం చర్చకు వచ్చింది. ఆ విషయం గురించి దర్శకుడు సింగీతం ఆసక్తి చూపుతూ వచ్చారు. ఆయన సంగతేమో కానీ, బాలకృష్ణ మాత్రం దానికి సీక్వెల్ కు రెడీ అంటున్నారు. అందుకు టైటిల్ కూడా ప్రకటించేశారు ఈ హీరో.
ఆదిత్య 999 పేరుతో ఆ సినిమా రూపొందుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. ఒక రోజు రాత్రికి రాత్రి ఆ సినిమాకు కథ తట్టిందని, ఆ సినిమా చాలా ప్రయోగాత్మకంగా ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించే అవకాశాలను బాలకృష్ణ కొట్టి వేయలేదు. తను దర్శకత్వం వహించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అయితే అది కూడా ఖరారు చేయలేదు.