బాలయ్య కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బాబి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.
ఓ పెద్ద బాక్స్ తెరుచుకుంటుంది. బాలయ్య బ్రాండ్ మాన్సన్ హౌజ్ ఫుల్ బాటిల్, దాని పక్కనే సిగరెట్ ప్యాకెట్. కొంత డబ్బు, ఎన్నో మారణాయుధాలు. ఈ సెటప్ అంతా పెట్టి బాలయ్య 109వ సినిమాను ఎనౌన్స్ చేశారు. “ప్రపంచానికి ఆయన తెలుసు, కానీ ఆయన ప్రపంచం ఎవ్వరికీ తెలియదు” అనే క్యాప్షన్ తో స్టయిలిష్ గా ఈ మూవీని ప్రకటించారు.
ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహహిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఎనౌన్స్ మెంట్ లో తమన్ పేరు లేదు.
బాలయ్య నెక్ట్స్ మూవీకి కూడా తమనే సంగీతం అందించబోతున్నాడంటూ భారీగా ప్రచారం నడుస్తోంది. అంతా దానికే ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ ఇవాళ్టి ప్రకటనలో తమన్ ప్రస్తావన లేదు. దర్శకుడు బాబికి మాత్రం తమన్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరితో వర్క్ చేసిన అనుభవం ఉంది. ఈ ఇద్దర్లో బాలయ్య ఎవరి పేరు సూచిస్తే, ఆ పేరు ఫైనల్ అవుతుంది.
ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బాబి దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.