అన్ స్టాపబుల్ ను ఇలా కూడా వాడేస్తున్నారా..!

బాలయ్యను యాంకర్ గా మార్చిన షో అన్-స్టాపబుల్. ఆహా యాప్ కు ఓ పేరు, క్రేజు తీసుకొచ్చిన షో ఇది. సీజన్-1 బాగానే చేశారు. సీజన్-2 మాత్రం బెడిసికొట్టింది. ఇప్పుడు సీజన్-3కి కిందా మీద…

బాలయ్యను యాంకర్ గా మార్చిన షో అన్-స్టాపబుల్. ఆహా యాప్ కు ఓ పేరు, క్రేజు తీసుకొచ్చిన షో ఇది. సీజన్-1 బాగానే చేశారు. సీజన్-2 మాత్రం బెడిసికొట్టింది. ఇప్పుడు సీజన్-3కి కిందా మీద పడుతున్నారు.

మొత్తానికి అన్-స్టాపబుల్ మళ్లీ షురూ కాబోతోంది. అయితే 2-3 ఎపిసోడ్స్ తో ముగియబోతున్న దీనికి సీజన్ అని పేరు పెట్టడం లేదు. దీనికి లిమిటెడ్ ఎడిషన్ అని పేరుపెట్టారు. ఉన్నఫలంగా ఇలా ఈ లిమిటెడ్ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం భగవంత్ కేసరి ప్రచారం అనిపిస్తోంది.

తన సినిమా కాబట్టి తాను ప్రమోట్ చేసుకోవడంలో తప్పు లేదు. అయితే ఇప్పుడీ కార్యక్రమానికి పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు బాలయ్య. నర్మగర్బంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

“మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవొంచమని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవ్వడూ రాలేడని మీకు తెలుసు. అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం.”

'లిమిటెడ్' అన్-స్టాపబుల్ లో బాలయ్య ప్రారంభ ఉపన్యాసం ఇలా సాగింది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలకు, ఈ డైలాగ్స్ కు లింక్ ఉందనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను ఈ డైలాగ్ తోనే స్టార్ట్ చేశారు.

అన్-స్టాపబుల్ సీజన్-2కే పొలిటికల్ టచ్ వచ్చేసింది. దానికితోడు సరైన గెస్టులు లేకపోవడం ఆ సీజన్ ను దెబ్బకొట్టింది. చూస్తుంటే, ఇప్పుడా రాజకీయ వాసనల్ని ఈ లిమిటెడ్ ఎడిషన్ లో కూడా కొనసాగించేలా కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే, రాబోయే రోజుల్లో అన్-స్టాపబుల్ రాజకీయ రచ్చ గ్యారెంటీ.