Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎట్టెట్టా.. ఇది నిజమేనా సుక్కూ..!

ఎట్టెట్టా.. ఇది నిజమేనా సుక్కూ..!

రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ చేతులు కలిపారు. అధికారికంగా సినిమా ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ వీళ్లు తేదీలు చెబుతుంటేనే కామెడీగా అనిపిస్తోంది.

రామ్ చరణ్-సుకుమార్ కలిసి ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెడతారంట. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో సినిమాను విడుదల చేస్తారట. ఈ ప్రకటన చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. సుకుమార్ విషయంలో ఇలాంటి డేట్స్ వర్కవుట్ అవ్వవని చెబుతున్నారు.

చెక్కుడుకి మారుపేరు సుక్కూ. ఓ సీన్ ను తను అనుకున్న విధంగా వచ్చేంత వరకు తీస్తూనే ఉంటాడు. ఈ విషయంలో డెడ్ లైన్లు, టార్గెట్స్ లాంటివేం సుకుమార్ దగ్గర పనిచేయవు. ఇక ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లాంటివి అస్సలు నడవవు. దీనికి పుష్ప-2నే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెబుతున్నారు చాలామంది.

స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ అంతా రెడీగా ఉన్న పుష్ప-2 సినిమాకే సుకుమార్ ఎంత టైమ్ తీసుకున్నాడో అందరూ చూస్తున్నారు. గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ అని ప్రకటించిన తర్వాత కూడా సినిమా విడుదలపై ఎప్పటికప్పుడు "అనుమానపు కథనాలు" వస్తున్నాయంటే అదంతా సుకుమార్ చలవే.

అలాంటి సుకుమార్ తో సినిమా చేయబోతూ డేట్స్, టార్గెట్స్ ప్రకటించింది రామ్ చరణ్ టీమ్. ఇదే పెద్ద జోక్ అనుకుంటే, మరో పెద్ద జోక్ చరణ్ వైపు నుంచి కూడా వినిపిస్తోంది.

ఎప్పట్నుంచో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమానే ఇంకా కొలిక్కి రాలేదు. చెక్కుడులో సుకుమార్ కు గురువు శంకర్. అతడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. పోనీ ఇది త్వరగానే పూర్తవుతుందని అనుకుందాం. చరణ్ త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. చెక్కుడులో సుకుమార్ కు శిష్యుడు బుచ్చి.

అటు సుక్కూ నుంచి, ఇటు చరణ్ నుంచి ఇన్ని లంకెలు పెట్టుకొని.. షూటింగ్ డేట్స్, విడుదల తేదీలు ప్రకటిస్తుంటే కాస్త కామెడీగానే ఉంటుంది కదా.. కాదంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?