హిందీలో భాగీ సీరిస్ లో నాలుగో సినిమాకు సమాయత్తం అవుతున్నారట. నాలుగో దాంట్లో కూడా టైగర్ ష్రాఫ్ నటించబోతున్నాడట. ఈ సినిమాను కూడా భారీ ఎత్తున, భారీ బడ్జెట్లో, అంతా ఏ-లిస్ట్ నటులతో తీయబోతున్నారట! మరి ఇంతకీ ఈ సారి భాగీ ఏ సినిమాకు రీమేక్ గా వస్తుందనేదే సందేహం.
తెలుగులో సూపర్ హిట్టైన వర్షం సినిమా రీమేక్ గా భాగీ-1 వచ్చింది. ఇక భాగీ -2 అంటూ క్షణం సినిమాను రీమేక్ చేశారు. ఇక తమిళంలో సూపర్ హిట్టై, తెలుగులో కూడా రీమేక్ అయిన వేట్టై సినిమాను భాగీ-3 అంటూ తీశారు. ఈ సినిమాను తెలుగులో తఢాఖా పేరుతో తెలుగులో రీమేక్ చేసి ఉన్నారు. ఇలా ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని సినిమాలను భాగీ సీరిస్ పేరుతో హిందీలో ఒకే హీరోతో వరసగా తీస్తూ వస్తున్నారు.
రీమేక్ సినిమాలతో పేరెన్నికగన్న సాజిద్ నడియావాలా ఈ సినిమాల వెనుక ఉంటున్నాడు. నాలుగో వెర్షన్ ను కూడా అదిరిపోయేలా తీస్తామంటూ ఆయన ప్రకటిస్తున్నారు. మరి ఈ సీరిస్ లో నాలుగోది కూడా కచ్చితంగా మరేదో సినిమాకు రీమేక్ అయి ఉంటుందనడంలో సందేహం ఏమీ లేనట్టే.
మొత్తానికి ఒకదానితో మరోటి అణుమాత్రమైనా సంబంధం లేని దక్షిణాది సినిమాలను ఒకే టైటిల్ తో సీరిస్ గా తీసుకుంటూ పోతున్నారు. హౌస్ ఫుల్ సీరిస్ లో కూడా ఇదే తరహాలో సౌత్ లో వచ్చిన వివిధ కామెడీ సినిమాలను ఒకదాని తర్వాత మరోటి తీస్తూ ఉన్నారు బాలీవుడ్ సినీ రూపకర్తలు.