నిర్మాతలు, డైరక్టర్ల ప్లానింగ్ అలా వుంటుంది. బోలెడు ఖర్చు పెట్టి పాట తయారు చేయిస్తారు. విదేశాల్లో షూట్ చేయిస్తారు. కానీ తీరా చివరకి వచ్చేసరికి లెంగ్త్ ఎక్కువైందనో, నడకకు అడ్డం పడిందనో అనిపిస్తుంది. పాట లేచిపోతుంది. కనీసం ఎలా లేదన్నా యాభై లక్షలు వృధా ఖర్చుగా మిగిలిపోతుంది.
నితిన్-రష్మికల భీష్మ సినిమాకు ఇదే జరిగిందని తెలుస్తోంది. సినిమాలో అయిదు పాటలు వుంటాయి. అలాగే తయారుచేయించారు. వీటిలో రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. వాటిల్లోంచి ఓ పాటను ఇప్పుడు లేపేసినట్లు తెలుస్తోంది. అంటే సినిమా మొత్తం మీద నాలుగు పాటలే వుంటాయి. ఇప్పటికే మూడు పాటలు బయటకు వచ్చాయి. మరో పాటను విడుదల చేసి, అయిదో పాటను మాత్రం దాచుకోవడమే.
బయటకు వచ్చిన మూడు పాటలు హిట్ అయ్యాయి. విజువల్ గా కూడా బాగున్నాయి. అందువల్ల అయిదోపాట లేకపోయినా వచ్చిన నష్టం లేదని యూనిట్ డిసైడ్ అయినట్లు బోగట్టా. ఆ విధంగా పాట కు పెట్టిన మొత్తం ఖర్చు వృధా అయినట్లే అనుకోవాలి.