బిగ్‌బాస్ రియాల్టీ షో అంటే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమమని ప్రేక్షకులు భావిస్తారు. రోజువారీ జీవితంలో రకరకాల ఒత్తిళ్లతో అలసిపోయిన వాళ్లు కాస్తా రిలీఫ్ కోసం బిగ్‌బాస్ షో చూడాలనుకుంటారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ షోను వీక్షించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అలా ఈ వారం రియాల్టీ షో చూసిన ప్రేక్షకులు … “భరించలేం బాబోయ్” అని హాహాకారాలు పెట్టాల్సి వచ్చింది.
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పదోవారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక చూడండి …షోలో ఒకటే ఏడ్పులు, పెడబొబ్బలు. ఇదొక గేమ్ షో అనే విషయం అందరికీ తెలుసు. ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి వుంటుందని కూడా కంటెస్టెంట్లందరికీ బాగా తెలుసు.
ఓ పది వారాలు ఒకే ఇంట్లో ఉంటూ కలిసి ప్రయాణం చేస్తే సహజంగా వ్యక్తుల మధ్య మానసిక బంధం ఏర్పడుతుంది. అదేంటో గానీ, హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం అంటే …. జీవితం నుంచి ఇక శాశ్వతంగా ఎలిమినేట్ అవుతున్నట్టు నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్లకు ఓ భావన కలుగుతుంది.
గత సీజన్‌లో ప్రతి దానికి శివజ్యోతి ఏడ్వడం చూశాం. ఆమె ఏడ్పును జనం భరించలేం బాబోయ్ అని అంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా దారిలో పడి దాదాపు చివరి వరకు కొనసాగారు.
ఇక ఈ సీజన్‌కు వస్తే మోనాల్ పదేపదే ఏడుస్తూ ప్రేక్షకుల్ని విసిగిస్తున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. కానీ వీళ్ల రికార్డులన్నింటిని నిన్న ఎలిమినేట్ అయిన మెహబూబ్ బద్దలు కొడుతూ ఏడ్పులు, పెడబొబ్బలు తీశాడు. మెహబూబ్‌కు సోహైల్ జత కలిశాడు. అబ్బా ఇక చెప్పేదేముంది …అగ్గికి ఆజ్యం తోడైనట్టైంది.
మెహబూబ్ వెళ్లిపోతున్నాడని తెలిసి, అతని మిత్రుడు సోహైల్ కన్నీటిపర్యంతమవుతాడు. టాప్ 5లో ఉంటామంటూ ఇప్పుడు వెళ్లిపోతున్నాడని చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంటిసభ్యుల నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాతైనా ఏడ్పు గోల తప్పిందని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ప్రేక్షకులను బిగ్‌బాస్ నీడలా వెంటాడాడు. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కూడా మెహబూబ్ తన ఏడ్పు పంథాను కొనసాగించాడు.
ఒక్కొక్కరి గురించి చెబుతూ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇక సోహైల్ దగ్గరికి వచ్చే సరికి ఏమీ మాట్లాడలేక నేలకు కొడుతూ ఏవేవో చేశాడు. మెహబూబ్ ఏడ్పునకు మరోసారి సోహైల్ మాటలు, ఏడ్పు జత కలిశాయి.
చివరికి ఒక హిందీ పాటకు భావోద్వేగంతో కూడిన డ్యాన్స్‌తో మెహబూబ్ తన బిగ్‌బాస్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఏదో కాసేపు రిలాక్స్ అవుదామని రియాల్టీ షో చూసేందుకు టీవీల ముందు కూచున్న ప్రేక్షకులను బిగ్‌బాస్ చావబాదాడని చెప్పొచ్చు.