ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటారు. కరోనా వైరస్ బతుకులను తలకిందులు చేసింది. ఇంకా మున్ముందు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అంచనాలకు అందడం లేదు. కరోనాను కట్టడి చేసేందుకు రెండు నెలలుగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అయినప్పటికీ కరోనాను అరికట్టలేని దుస్థితి. దానికి వ్యాక్సిన్ వస్తే తప్ప కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే ఆర్థికంగా కుదేలైన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. రెండునెలలుగా ఎలాంటి షూటింగ్‌లు జరగకపోవడంతో బుల్లితెర, వెండితెరలను నమ్ముకుని జీవన సాగిస్తున్న కార్మికులు వీధినపడ్డారు. ఉపాధి కరువై, జీవనం బరువైంది. చాలా మంది సినీ కార్మికులకు పూట గడవ డానికే కష్టమైంది. కొందరు నటులు బతుక బండి ముందుకు సాగించేందుకు రోడ్డెక్కారు.
ఈ కోవలో బాలీవుడ్ నటుడు సోలంకి దివాకర్ ఉన్నాడు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డ్రీమ్‌గార్ల్ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన సోలంకి దివాకర్ అనే నటుడు గత రెండు నెలలుగా పండ్లు అమ్ముకుంటున్నాడు. ఈయన చిత్ర పరిశ్రమలోకి రాక ముందు పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు.
చివరికి విపత్తు సమయంలో పాత వృత్తే అతనికి ఉపాధి మార్గమైంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో చేసేందుకు ఎలాంటి పనిలేక అతను తిరిగి పాత వృత్తినే కొనసాగిస్తున్నారు. పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా నిలిచారు. సోలంకి సినిమా అభిమానులకు సుపరిచితుడే. ఆయన హల్క, హవా, టిట్లీ, కడ్వి హవా, సోంచారియా తదితర చిత్రాల్లో నటించారు.