ఇన్నాళ్లూ బాలీవుడ్ నుంచి భామలు మాత్రమే దిగుమతయ్యారు. కానీ ఇప్పుడు నార్త్ నుంచి నటులు కూడా దిగొస్తున్నారు. హిందీలో అంతోఇంతో పాపులారిటీ ఉండి, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న వాళ్లంతా సౌత్ వైపు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
మనోళ్లు కూడా పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ నటుల వెంట పడుతున్నారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈమధ్య కాలంలో ఏకంగా అరడజను బాలీవుడ్ నటులు టాలీవుడ్ లోకి వచ్చారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు.
నిజానికి హరిహర వీరమల్లు సినిమా కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో అ ప్రాజెక్టు నుంచి అర్జున్ రాంపాల్ డ్రాప్ అయ్యాడు. ఆ వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలోకి వచ్చేశాడు.
హరిహర వీరమల్లు సినిమాలో ఖాళీ అయిన అర్జున్ రాంపాల్ స్థానాన్ని బాబీ డియోల్ తో భర్తీచేశారు మేకర్స్. అలా అక్కడ కూడా బాలీవుడ్ కు న్యాయం చేశారు. ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఏజెంట్ సినిమాతో డినో మారియా టాలీవుడ్ విలన్ గా మారాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా, అక్కడక్కడ డినో మెప్పించాడు.
నార్త్ నుంచి తెలుగులోకి వచ్చిన బాలీవుడ్ నటుల్లో సైఫ్ అలీఖాన్ కూడా చేరిపోయాడు. ఆదిపురుష్ సినిమాలో రావణ్ గా నటించిన ఈ సీనియర్ హీరో, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
అటు వెంకీ నటిస్తున్న సైంధవ్ సినిమాతో నవజుద్దీన్ సిద్ధిఖీ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇతడిది కీలక పాత్ర అంటూ యూనిట్ చెబుతున్నప్పటికీ, అది విలన్ రోల్ అని అంటున్నారు చాలామంది. తాజాగా ఇప్పుడీ లిస్ట్ లోకి 'ముద్దుల' హీరో ఇమ్రాన్ హస్మి కూడా చేరిపోయాడు.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఇమ్రాన్ హస్మి. బాలీవుడ్ లో ఇప్పటికే హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు ఇమ్రాన్. ఇప్పుడు ఓజీ సినిమాతో తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఇలా పాన్ ఇండియా అప్పీల్ కోసం టాలీవుడ్ మేకర్స్ అంతా బాలీవుడ్ నటీనటుల వెంట పడుతున్నారు. వీళ్లలో డినో మోరియా ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు. మిగతా నటుల్లో ఎంతమంది క్లిక్ అవుతారో చూడాలి.