Advertisement

Advertisement


Home > Movies - Movie News

నేను బతికుండగా బయోపిక్ రానివ్వను..!

నేను బతికుండగా బయోపిక్ రానివ్వను..!

కమర్షియల్ సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు బయోపిక్స్ కూడా వస్తుంటాయి. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్టయింది. మరి అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ వస్తుందా..?

ఇదే ప్రశ్న బోనీ కపూర్ కు ఎదురైంది. దీనికి ఆయన సూటిగా సమాధానమిచ్చారు. "నేను బతికుండగా నా భార్య శ్రీదేవి బయోపిక్ తీయడానికి అనుమతించను" అనేది ఆయన సమాధానం. దీనికి ఆయన ఇచ్చే వివరణ కూడా సహేతుకంగా ఉంది.

సినిమాల సంగతి పక్కనపెడితే, వ్యక్తిగతంగా శ్రీదేవి ఎప్పుడూ గుంభనంగా వ్యవహరించారు. ఆమె తన వ్యక్తిగత విషయాల్ని ఎప్పుడూ బయట చర్చించలేదు. అలాంటి హీరోయిన్ పై బయోపిక్ తీస్తే కచ్చితంగా కల్పితాలు తెరపైకొస్తాయనేది బోనీ కపూర్ భయం.

పైగా శ్రీదేవి చాలా ప్రైవేట్ వ్యక్తి అని, తన వ్యక్తిగత జీవితం ప్రైవేట్ గా ఉండేలా ఆమె నిరంతరం జాగ్రత్తలు తీసుకున్నారని, అలాంటి వ్యక్తి మృతి చెందిన తర్వాత, ఆమె ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ చేయాలని అనుకోవడం తప్పని, దానికి తను ఎంతమాత్రం అంగీకరించనని అంటున్నారు.

బోనీ కపూర్ వివరణ పక్కనపెడితే, శ్రీదేవి మరణం బాధాకరం. దుబాయ్ లో బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయింది. అప్పట్లో ఆమె మరణంపై ఎన్నో కథనాలు, అనుమానాలు తెరపైకొచ్చాయి. ఒక దశలో బోనీ కపూర్ ను కూడా చాలామంది అనుమానించారు. అలా తన భార్య మరణం వివాదాస్పదమవ్వడంతో, ఆమె జీవితాన్ని తెరపైకి తీసుకొస్తే, అవన్నీ మరోసారి ప్రస్తావించాల్సి వస్తుంది. 

అది బోనీకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే తను బతికుండగా శ్రీదేవి బయోపిక్ రానివ్వనని ఆయన ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?