బొత్సకు చుట్టుకుంటున్న బండ్ల ట్వీట్ లు

ఉరిమి..ఉరిమి..దేనిమీదో పడినట్లుంది…బండ్ల ట్వీట్ ల వ్యవహారం. ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది బండ్ల గణేష్ ఒక్కసారిగా విజయసాయిరెడ్డి మీద విరుచుకు పడ్డారు. గత రెండున్నరేళ్లుగా విజయసాయి రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అలాగే వున్నారు.…

ఉరిమి..ఉరిమి..దేనిమీదో పడినట్లుంది…బండ్ల ట్వీట్ ల వ్యవహారం. ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది బండ్ల గణేష్ ఒక్కసారిగా విజయసాయిరెడ్డి మీద విరుచుకు పడ్డారు. గత రెండున్నరేళ్లుగా విజయసాయి రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అలాగే వున్నారు. ఆయన విశాఖలో పార్టీని బలోపేత చేయాలనుకుంటున్నారు. అక్కడ కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యానికి బ్రేకులు వేస్తున్నారు.

అయితే అలా అని కమ్మవారు అందరినీ దూరం పెట్టలేదు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆఢిటర్ జివి ఇలాంటి వారంతా విజయసాయితో హ్యాపీగానే వున్నారు. మరి ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఉన్నట్లుండి బండ్ల ఇలా విరుచుకుపడడాన్ని కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ కోణంలోనే చూస్తున్నారు వైకాపా జనాలు.

మంత్రిత్వ శాఖ మారడం, ప్రాధాన్యత లేని శాఖ దొరకడం, ఇదంతా విజయసాయి చేసినదే అని బొత్స భావిస్తున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. గత రెండేళ్లుగా విజయసాయితో బొత్సకు అంత గొప్ప సంబంధాలు లేవు. బొత్సకు బండ్ల గణేష్ ప్రాణ స్నేహితుడు. హైదరాబాద్ వస్తే బొత్సతోనే వుంటారు బండ్ల. 

అందుకే తన మిత్రుడికి విజయసాయి వల్ల అన్యాయం జరుగుతోందనో ఆలోచనతోనే బండ్ల ఇలా విరుచుకు పడుతున్నారని వైకాపా వర్గాలు బలంగా భావిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని బొత్స తోసిపుచ్చుతున్నారని బోగట్టా. ఇలాంటి వార్తలు రావడం తనను హర్ట్ చేసిందని బొత్స ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

అసలు తన ట్వీట్ లకు బొత్సకు సంబంధం ఏమిటని బండ్ల ప్రశ్నిస్తున్నారు. పైగా చిరకాలంగా బండ్లను చాలా మంది కాపు సామాజిక వర్గం అని భావిస్తారు. కానీ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. అది ఇప్పుడు బలంగా బయటకు వచ్చింది. 

మొత్తానికి బండ్ల ట్వీట్ లు ఆయనకు ఏ సమస్య తీసుకురావు కానీ, జగన్ దృష్టికి ఇదంతా బొత్సకు శాఖ కేటాయింపు పర్యవసానం అని వెళ్తే మాత్రం వేరుగా వుంటుంది. ఎందుకంటే జగన్ దేనిని అయినా సహిస్తారు కానీ ఇలాంటి బెదిరింపులు, ఎదురుదాడులు సహించరు. పైగా విజయసాయి విషయం లో ఆయనను ఎవ్వరూ పక్కదారి పట్టించలేరు.

తన మిత్రుడు బొత్స కోసమైనా బండ్ల కాస్త వెనక్కు తగ్గడం మంచిదేమో?